గుస్సాడికి గూడేల ముస్తాబు..

01-11-2026 | 05:49pm

వారం రోజులపాటు దండారి పండుగ వేడుకలు.. 

బోథ్ నవంబర్ 1 (విజయక్రాంతి): ఆదివాసి గూడేలలో గుస్సాడీ వేషాలతో దండారి పండుగ(Dandari Festival)కు ఆదివాసీలు సిద్ధమయ్యారు. గూడేలలోని పటేన్ల ఇంటి వరకు రకరకాల రంగులతో కూడిన జెండాలను కట్టి పండుగ వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. దీపావళి పండుగకు వారం రోజుల ముందుగానే గుస్సాడీ పండుగ ప్రారంభమవుతుంది. 

మొదట అలంకరణ సామాగ్రికి పూజలు చేసి....

గుస్సాడీలు ధరించే నెమలి టోపీ చేతిలోని దుడ్డు కర్ర, జింక చర్మం, తోపాటు గుస్సాడీలు వేసుకునే వివిధ రకాల అలంకరణ సామాగ్రిని గ్రామ పటేల్ ఇంటి ముందు పెట్టి గ్రామస్తులంతా ఒక చోటికి చేరి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గుసాడి వేషాలు వేసే యువకులు వాటిని ధరించడం జరుగుతుంది. దీపావళి పండుగ పూర్తి అయ్యేంతవరకు కార్యక్రమాలు కొనసాగిస్తుంటారు. 

పల్లెల్లో పండుగ వేడుకలు...

గుస్సాడి పండుగను జరుపుకునేందుకు గూడేలు ముస్తాబయ్యాయి. పది రోజుల ముందు నుండి డప్పు వాయిద్యాలను అనుసరిస్తూ నాట్యం చేసేందుకు యువకులు శిక్షణ తీసుకుంటారు. అయితే డప్పు వాయిద్యాలను అనుకరిస్తూ నృత్యాలు చేయడం జరుగుతుంది. అంతేగాక గత ఏడాది ఆదిత్యానికి వచ్చిన గుస్సాడీలా గ్రామానికి వెళ్లి నృత్యాలు చేసి రావడం జరుగుతుంది. వెళ్లిన గుసాడీలకు గ్రామస్తులంతా మర్యాదలు చేసి భోజన వసతి కల్పించి రాత్రి గుస్సాడీ నృత్యాలు చేసి తిరిగి వస్తారు.

ఆతిథ్యంకు వెళ్లి పెళ్లి చూపులు..

గుస్సాడి వేషాలను వెళ్లిన వారి వెంట గ్రామానికి చెందిన యువకులు సైతం వెళుతుంటారు. అయితే ఆదిత్యానికి వెళ్లిన గ్రామాల్లో యువకులు పెళ్లి సంబంధాలను చూసుకుంటారు. వారికి నచ్చిన యువతిని చూసిన తర్వాత వారి కుటుంబీకుల సమాచారాన్ని తెలుసుకొని పెళ్లి సంబంధాలను కుదుర్చుకుంటారు.

అంతేగాక ఆడపిల్లల సహితం గుస్సాడీలను వారి వెంట వచ్చిన వారిని చూడడం జరుగుతుంది. అతిథి మర్యాదలకు, పెళ్లి సంబంధాలకు గుస్సాడి పండుగ వేడుకలు వేదికలు కానున్నాయి. కాగా వారం రోజులపాటు ఆదివాసీలు తమ పొలం పనులకు స్వస్తి పలికి గుస్సాడి వేడుకల్లో పాల్గొంటారు. ఏదేమైనా ఆదివాసి గుండెలు దప్పుల తప్పులతో గుస్సాడీల కాలి గజ్జల చప్పులతో మారుమరవుతుంటాయి. 

వారెవ్వా గుస్సాడీ వేషం...

గుస్సాడి వేషం చూడ ముచ్చటగా ఉంటుంది. తలపై నెమలి ఈకలతో తయారు చేసిన టోపీ ఓ చేతిలో దుడ్డు కర్ర మరో చేతిలో జంతు చర్మం మెడలో వివిధ రకాల హారాలు ఒళ్లంతా బూడిద పోసుకొని చూడముచ్చటగా గుసాడి వేషం కనిపిస్తుంది. వారు వేసి స్టెప్పులను చూసేందుకు గ్రామాల ప్రజలు ఆసక్తి చూపుతారు. దండారి పండుగ ఆదివాసి గూడెలలో ఆనందం నింపుతుంది.

మరిన్ని వార్తలు