కరెంటు కోతలు.. రైతుల అవస్థలు
బోథ్, అక్టోబర్ 10 (విజయక్రాంతి): రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతుండటంతో విద్యుత్ వినియోగం సైతం అధికమవుతోంది. దీంతో అనధికారికంగా విద్యుత్ కోతలు పెరిగిపోతున్నాయి. తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు (Power Supply).
పంటలకు అవసరమైన నీటి తడులు పెట్టేందుకు రైతులు విద్యుత్ మోటార్లను వినియోగిస్తుండగా, మరోవైపు ఇళ్లలో ఉక్కపోతను భరించలేక ప్రజలు కూలర్లు, ఫ్యాన్లను ఉపయోగిస్తున్నారు. ఈ సమయంలో విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడటంతో ప్రజలు, రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ డిమాండ్ అధికం కావడంతో పాటు సరఫరాలో సమస్యలు ఎదురవుతుండటంతో ఇబ్బందులు తప్పడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సమస్య ఇలాగే కొనసాగితే ఆందోళనలు, ధర్నాలు చేపట్టేందుకు సైతం సిద్ధంగా ఉన్నామని రైతులు హెచ్చరిస్తున్నారు (Protest). అధికారులు స్పందించి నిరంతర విద్యుత్ సరఫరా (Continuous Supply) అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.