పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్
ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాల కేసు
భిక్కనూర్, అక్టోబర్ 10 (విజయక్రాంతి): ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాల కేసుల్లో(Transformer theft case) పరారీలో ఉన్న తక్ షంషేర్ సింగ్‌ను భిక్కనూర్ పోలీసులు(Bhikkanoor Police) అరెస్ట్ చేశారు. మరో నేరానికి పాల్పడేందుకు రెక్కీ నిర్వహిస్తున్న సమయంలో పట్టుకున్నట్లు తెలిపారు. విచారణలో కామారెడ్డి, మెదక్ జిల్లాల(Kamareddy and Medak districts) పరిధిలోని 54 ట్రాన్స్‌ఫార్మర్ చోరీ కేసుల్లో తన ప్రమేయం ఉన్నట్లు వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఈ కేసుల్లో మొత్తం 73 ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. నిందితుడి నుంచి రెండు బ్లేడ్లు, రెండు కటింగ్ ప్లేయర్లు, రెండు పానాలు, కట్టర్, సైకిల్ ట్యూబ్, నంబర్ ప్లేట్ లేని ప్యాషన్ ప్రో బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాలతో, డీఎస్పీ ఎస్. మధుసూదన్ పర్యవేక్షణలో సీఐ జె. నరేష్, ఎస్‌ఐ అనిల్, ఏఎస్ఐ వెంకట్‌రావు, పీసీలు బాలకృష్ణ, శ్రీకాంత్, కిషన్ గౌడ్, శేఖర్ ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాలు, అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు.