ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి
ఐటీడీఏ ఉట్నూర్ అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి జాదవ్ వసంత్ రావు
ఉట్నూర్,(విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమం(Prajavani program)లో ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఉట్నూర్ ఏపిఓ జాదవ్ వసంత్ రావు(ITDA Utnoor APO Jadhav Vasant Rao) అధికారులను ఆదేశించారు.
సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల వినతులను ఆయన స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో జైనూర్ మండలం బూసిమెట్ట గ్రామానికి చెందిన కండుజీ తనకి సోలార్ మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు. సాత్నాల మండలం తోయగూడ గ్రామానికి చెందిన సిధార్థ్ తనకు ల్యాప్ టాప్ ఇప్పించమని కోరారు.
ఆసిఫాబాద్ మండలం తెమరా వెలువడ గ్రామానికి చెందిన సోము తన ఆయిల్ ఇంజన్ మరియు పైప్ లు మంజూరు కొరకు విజ్ఞప్తి చేశారు. నేరడిగొండ మండలం బుగ్గరాం గ్రామానికి చెందిన లహరి తనకు ఆర్థిక సహాయం చేయమని దరఖాస్తు అందజేశారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల లబ్ధి, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యల పరిష్కారం తదితర అంశాలపై తమ వినతిపత్రాలను సమర్పించారు. ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖ అధికారులు బాధ్యతాయుతంగా పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి జాదవ్ వసంత్ రావ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.