ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తాం
రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
చెన్నూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణాన్ని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. సోమవారం జిల్లాలోని చెన్నూర్ పట్టణంలో 15వ వార్డులో అభివృద్ధి పనులకు అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ చెన్నూర్ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులకు ప్రజలు సహకరించడం అభినందనీయమని, ప్రజల సహకారంతోనే అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయగలమని తెలిపారు. డి.ఎం.ఎఫ్.టి. నిధుల ద్వారా 50 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, రోడ్డు విస్తరణలో భాగంగా దుకాణాలు కోల్పోయిన వ్యాపారులకు ప్రత్యామ్నాయంగా 70 షాపులను కేటాయించేందుకు చర్యలు చేపట్టాలని, స్లాట్ల వారీగా కేటాయింపు ప్రక్రియను నిర్వహించి 3, 4 నెలలలో పూర్తి చేయాలని తెలిపారు.
ట్రాఫిక్ సమస్యలను తగ్గించి, లారీల రాకపోకల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా బైపాస్ రహదారి నిర్మాణానికి 1 కోటి 60 లక్షల రూపాయలతో పనులు చేపట్టే అంశాన్ని పరిశీలించి, పట్టణాన్ని ఆధునికంగా తీర్చిదిద్దేందుకు రహదారులు, డ్రైనేజీలు, మార్కెట్లు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గోదావరి పుష్కరాల సందర్భంగా అవసరమైన ఏర్పాట్లు, అభివృద్ధి పనుల కోసం 6 కోట్ల రూపాయలతో పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
చెన్నూర్‌లోని శివాలయ అభివృద్ధికి 17 కోట్ల రూపాయలతో పనులు చేపట్టే అంశాన్ని పరిశీలించడం జరుగుతుందని, పుష్కరాలకు వచ్చే భక్తులకు, స్థానిక ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. పట్టణంలోని అన్ని వార్డులలో సి.సి. డ్రైనేజీల నిర్మాణం చేపట్టి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని, వర్షపు నీరు నిల్వ ఉండకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి కోసం 20 లక్షల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందని, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నాన్‌వెజ్ మార్కెట్, ప్రజా మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ముదిరాజ్, మైనారిటీ, గౌడ తదితర వర్గాలకు అవసరమైన కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని, సోమనపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుకు 200 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వసతి సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం అల్పాహారం అందించే పథకం అమలవుతుందని, విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, చదువుపై ఏకాగ్రత పెంపొందించేందుకు ఈ పథకం దోహదపడుతుందని తెలిపారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్దేశిత సమయంలో పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. పట్టణాన్ని ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు సమన్వయంతో ముందుకు సాగాలని తెలిపారు.
పట్టణంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి క్యాజువాలిటీ విభాగం, అత్యవసర వైద్య సేవల నిర్వహణ, రోగులకు అందిస్తున్న చికిత్స అంశాలను పరిశీలించి, సిబ్బంది హాజరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వైద్యాధికారులు, వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఆసుపత్రిలో రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సదుపాయాలు కల్పించాలని తెలిపారు.
వైద్యులు సమన్వయంతో విధులు నిర్వహించాలని, ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన వైద్య పరికరాల వివరాలను తెలుసుకుని, వాటిని సమకూర్చేందుకు చర్యలు తీసుకోవాలని, అత్యవసర వైద్య సేవలకు అవసరమైన పరికరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి సకాలంలో నాణ్యమైన వైద్యం అందేలా వైద్యులు, సిబ్బంది బాధ్యతతో పని చేయాలని, రోగులకు అవసరమైన వైద్య సదుపాయాలను మెరుగుపరుస్తూ, ఆసుపత్రి అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
ఆసుపత్రిలోని ఆర్.ఓ. ప్లాంట్‌ను పరిశీలించి, రోగులు, వారి సహాయకులకు శుద్ధి చేసిన త్రాగునీటిని అందించాలని, ఆసుపత్రి ప్రాంగణంలో పరిశుభ్రతను పాటిస్తూ, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు. పట్టణంలోని మధన పోచమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ నూతన కమిటీ చైర్ పర్సన్ సతీష్, పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ మల్లికార్జున్, చెన్నూర్ మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, చైర్పర్సన్ పెద్దింటి పద్మ, డి.సి.హెచ్.ఎస్. డా. కోటేశ్వర్ రావు, ఆసుపత్రి పర్యవేక్షకులు డా. సత్యనారాయణ, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.