మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవు
ఇంద్రవెల్లి ఘటనలో ఇరువర్గాల వారిపై కేసులు నమోదు.. ఆరుగురు అరెస్ట్
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు
వదంతులను నమ్మవద్దు.. అనుమానాలుంటే పోలీసులను సంప్రదించాలి
ఇంద్రవెల్లి ఎస్ఐ ఈ సాయన్న
ఉట్నూర్,(విజయక్రాంతి): ఇంద్రవెల్లి కేంద్రంలో బుధవారం చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి ఇరువర్గాల వారిపై కేసులు నమోదు చేసి, ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇంద్రవెల్లి ఎస్ఐ ఈ సాయన్న(Indravelli SI E. Sayanna) తెలిపారు. ఈ ఘటనను కొందరు వ్యక్తులు వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం, ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా పోస్టులు పెట్టడం, నిర్ధారణ కాని సమాచారాన్ని ప్రచారం చేయడం చట్టరీత్యా సమస్యలకు దారితీస్తుందని స్పష్టం చేశారు. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని గుడ్డిగా నమ్మవద్దని, నిజానిజాలు తెలుసుకోకుండా ఇతరులకు షేర్ చేయవద్దని సూచించారు.
తప్పుడు ప్రచారాలకు, వదంతులకు ప్రభావితమై ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడవద్దని కోరారు. ప్రాంతంలో శాంతి సామరస్యాలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఏవైనా అనుమానాలు లేదా సమస్యలు ఉంటే సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఎస్ఐ ఈ. సాయన్న తెలిపారు. ప్రజలు సంయమనం పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.