శోభాయమానంగా శబరి స్మృతి యాత్ర

26-10-2026 | 11:19pm

-ఆకట్టుకున్న కొమ్ము నృత్యాలు

-ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే డా. తెల్లం 

భద్రాచలం, అక్టోబర్ 26 (విజయక్రాంతి): భద్రాచలం(Bhadrachalam) శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఆశ్వయుజ పూర్ణిమను పురస్కరించుకొని సోమవారం గిరిజన ఉత్సవంగా శబరి స్మృతి యాత్ర శోభాయమానంగా సాగింది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన గిరిజనులు సీతారామలక్ష్మణులకు నీరజనం పలికారు.

ఈ క్రతువులో భాగంగా కార్య నిర్వహణ అధికారి కె.దామోదర్ రావు ఆదివారమే టీఎస్ ఆర్టీసీ బస్సులను వివిధ ప్రాంతాలకు పంపించి, గిరిజనులను ఆ బస్సుల ద్వారా భద్రాచలం తీసుకువచ్చారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 6:30 గంటలకు శబరి చిత్రపటంతో గిరి ప్రదక్షణ గావించి, తెలంగాణ టూరిజం వద్ద గల ధమ్మక్క విగ్రహం నందు పూజలు చేశారు. అనంతరం ఆలయంకు చేరుకుని, శ్రీ స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు.

దేవస్థాన ప్రచార రథంతో నిర్వహించిన శోభాయాత్ర అత్యంత శోభాయమానంగా నిలిచింది. గిరిజనులు తమ వెంట తీసుకువచ్చిన ఫల, పుష్పాలను స్వామివారికి నివేదించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన గిరిజనులకు దేవస్థానం తరపున కార్యనిర్వహణ అధికారి కె.దామోదర్ రావు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, లడ్డు ప్రసాదం, వసతి మొదలగు సౌకర్యాలను కల్పించారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు చేసిన కొమ్ము నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ కార్యక్రమంలో భద్రాచలం శాసనసభ్యులు తెల్ల వెంకట్రావు, భద్రాచలం సర్పంచ్ పూనెం కృష్ణ, మరియు వివిధ ఆదివాసి సంఘాల నాయకులు పాల్గొని శబరి స్మృతి యాత్రను విజయవంతం చేశారు.

మరిన్ని వార్తలు