ఇల్లందును కరువు మండలంగా ప్రకటించాలి

01-11-2026 | 05:22pm

మిషన్ భగీరథ లీకేజీ బాధితులకు పరిహారం ఇవ్వాలి: సీపీఎం

ఇల్లెందు, (విజయక్రాంతి): వర్షాధార పంటలపై ఆధారపడిన ఇల్లందు మండలాన్ని ప్రభుత్వం వెంటనే కరువు మండలంగా ప్రకటించాలని సీపీఎం(CPM) డిమాండ్ చేసింది. ఇల్లందు పట్టణంలో మిషన్ భగీరథ(Mission Bhagiratha) ప్రధాన పైప్‌లైన్‌కు తరచూ లీకేజీలు ఏర్పడి ప్రజలు, వ్యాపారులు నష్టపోతున్నారని, బాధితులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరింది.

సీపీఎం ఇల్లందు మండల విస్తృతస్థాయి సమావేశం ఆదివారం ఏలూరి లక్ష్మీనారాయణ భవన్‌లో మన్యం మోహన్‌రావు అధ్యక్షతన జరిగింది. పార్టీ జిల్లా నాయకుడు అబ్దుల్ నబీ, మండల కార్యదర్శి ఆలేటి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ.. సాగునీటి సౌకర్యంతో మూడు పంటలు పండే కొన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి, పూర్తిగా వర్షాధార పంటలపై ఆధారపడిన గిరిజన ప్రాంతమైన ఇల్లందును విస్మరించడం సరికాదన్నారు.

ఇటీవల స్టేట్‌బ్యాంక్ ప్రధాన శాఖ సమీపంలో మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకై వరద నీరు ప్రవహించడంతో బ్యాంకుతోపాటు పరిసర వ్యాపారులు నష్టపోయారని తెలిపారు. పట్టణంలోని జనావాసాలు, వాణిజ్య ప్రాంతాల గుండా ప్రధాన పైప్‌లైన్ వేయడం అశాస్త్రీయమని పేర్కొన్నారు. పైప్‌లైన్‌ను జనావాసాల నుంచి తొలగించి పట్టణం బయట నుంచి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు