రైతులతో ముఖాముఖి
విద్యుత్ సరఫరాపై క్షేత్రస్థాయి పరిశీలన
రైతుల సమస్యల పరిష్కారమే ధ్యేయం
విద్యుత్ శాఖ డి ఈ జీవన్ కుమార్
మణుగూరు, అక్టోబర్ 23,(విజయక్రాంతి ): రైతులకు నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్ సరఫరా(Electricity supply) అందించడమే లక్ష్యంగా భద్రాచలం డివిజన్ విద్యుత్ శాఖ డివిజన్ ఇంజనీర్ (డీఈ) జీవన్ కుమార్(DE Jeevan Kumar) క్షేత్రస్థాయిలో పర్యటించారు. పినపాక మండలంలోని పాతరెడ్డిపాళెం, చింతలబయ్యారం ప్రాంతాలతో పాటు మణుగూరు మండలంలోని(Manuguru Mandal) అనంతారం గ్రామంలో రైతులతో ముఖాముఖి సమావేశమయ్యారు.ఈ సందర్భంగా రైతులకు(Farmers) అందుతున్న విద్యుత్ సరఫరా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, లో-వోల్టేజ్ సమస్యలు(Low-voltage issues), ట్రాన్స్ఫార్మర్ల పనితీరు తదితర అంశాలపై రైతులతో నేరుగా చర్చించి వివరాలు సేకరించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్‌ను పొదుపుగా వినియోగించడంతో పాటు వ్యవసాయ అవసరాలకు నీటిని వృథా చేయకుండా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని రైతులకు సూచించారు.
ప్రభుత్వ సూచనల మేరకు రెండో పంటగా వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని అవగాహన కల్పించారు.విద్యుత్ సరఫరాలో రైతులకు ఎదురయ్యే సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటికి సత్వర పరిష్కారం చూపేందుకు విద్యుత్ శాఖ అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటారని డీఈ జీవన్ కుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మణుగూరు ఏఈ పద్మారావు, పినపాక ఏఈ వేణుగోపాల్, సబ్ ఇంజనీర్లు లారెన్స్, వీరారెడ్డి, విద్యుత్ శాఖ సిబ్బంది, స్థానిక రైతులు పాల్గొన్నారు.