జవహర్‌నగర్ సమస్యపై తగ్గేదే లేదు: ఈటల

23-10-2026 | 05:36pm

మేడ్చల్: జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్(Jawahar Nagar Dumping Yard) వల్ల పరిసర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(MP Etela Rajender) డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డ్‌ను తరలించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దమ్మాయిగూడలోని సాయి భవాని ఫంక్షన్ హాల్‌లో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(BJLP Leader Eleti Maheshwar Reddy)తో కలిసి నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. డంపింగ్ యార్డ్ నుంచి వెలువడే దుర్వాసన, కలుషిత నీరు, కాలుష్యంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శాశ్వత పరిష్కారం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.

25న సమావేశం.. 27న పాదయాత్ర

ఈ సమస్యపై ఈ నెల 25న రౌండ్ టేబుల్ సమావేశం, 27న భారీ పాదయాత్ర నిర్వహిస్తామని ఈటల ప్రకటించారు. అవసరమైతే జవహర్‌నగర్‌లో సకల జనుల సమ్మె చేపడతామని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సహా పార్టీ నేతల మద్దతుతో ప్రజల తరఫున ఐక్యంగా పోరాడతామని పేర్కొన్నారు. డంపింగ్ యార్డ్ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే కేంద్రం సహకారంతో ముందుకు వెళ్తామని తెలిపారు. స్థానికుల ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు