పుష్కరాల ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ అంకిత్
ఆలయ అభివృద్ధి, పుష్కర ఘాట్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి
ఐటీసీ నుంచి భద్రాచలం బ్రిడ్జి వరకు రహదారి సుందరీకరణకు వారం రోజుల్లో ప్రణాళిక సిద్ధం చేయాలి
భద్రాచలం (విజయక్రాంతి): గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులు, పుష్కర ఘాట్ల నిర్మాణం, భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన పనులను జిల్లా కలెక్టర్ అంకిత్(District Collector Ankit) మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, సంబంధిత శాఖల అధికారులు, ఇంజినీర్లతో కలిసి వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు.
ముందుగా శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి చేరుకున్న కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠకు ఆలయ అధికారులు స్వామివారిని దర్శించుకోగా, అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. దర్శనానంతరం ఆలయ ఉత్తర ద్వారం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్, ఆలయ ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో చేపట్టిన నిర్మాణాల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్లాబ్ నిర్మాణం, రక్షణ గోడలు, మట్టి నింపే పనులు తదితర నిర్మాణాలను పరిశీలించి, నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం ఆలయం నుంచి గోదావరి స్నాన ఘాట్లకు వెళ్లే రహదారిని పరిశీలించిన కలెక్టర్, భక్తుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా రహదారిని విస్తరించాలని ఆదేశించారు. ప్రస్తుతం సుమారు 25 అడుగుల వెడల్పు ఉన్న రహదారిని మరో ఐదు అడుగులు విస్తరించి 30 అడుగులకు పెంచే ప్రతిపాదనపై చర్చించారు.
రహదారికి ఇరువైపులా ఉన్న నిర్మాణాలు, మెట్లు, ఇతర అడ్డంకులను పరిశీలించి అవసరమైన చోట్ల మార్కింగ్ చేయాలని సూచించారు. వైకుంఠధామానికి వెళ్లే మార్గాన్ని పరిశీలించిన కలెక్టర్, పుష్కరాల సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఉన్న రహదారికి ప్రత్యామ్నాయంగా మరో మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణకు తగిన చర్యలు చేపట్టడంతో పాటు వైకుంఠధామం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు.
పుష్కర ఘాట్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్, ఉత్తర వైపు సుమారు 270 మీటర్లు, దక్షిణ వైపు 230 మీటర్ల పొడవున చేపడుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. ఘాట్ల వద్ద మెట్లు, ల్యాండింగ్ ప్రాంతాలు, రక్షణ గోడలను పటిష్టంగా నిర్మించాలని, పాత గోడలకు పగుళ్లు ఏర్పడిన చోట మరమ్మతులు చేపట్టాలని సూచించారు. పర్ణశాల వద్ద టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. సారపాక బ్రిడ్జి ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్, ఐటీసీ నుంచి భద్రాచలం బ్రిడ్జి వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర రహదారి సుందరీకరణకు చేపట్టాల్సిన చర్యలపై ఐటీసీ ప్రతినిధులు, సంబంధిత అధికారులతో చర్చించారు.
గోదావరి పుష్కరాలకు సమయం తక్కువగా ఉన్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మార్చిలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలతో పాటు జూన్ 27 నుంచి జూలై 7 వరకు నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట దేవస్థానం ఈవో దామోదర్ రావు, ఆర్ అండ్ బి ఈ ఈ నాగేశ్వరరావు, ఇంజనీరింగ్ శాఖ అధికారులు, తహసిల్దార్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.