రామగిరి ఖిల్లా ట్రెక్కింగ్‌కు తరలిరండి
అక్టోబర్ 18న బేగంపేట నుంచి ప్రారంభం
ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి (విజయక్రాంతి):పెద్దపల్లి జిల్లాలోని చారిత్రక వారసత్వ సంపద రామగిరి ఖిల్లా విశిష్టతను చాటడంతో పాటు ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశం కల్పించేందుకు నిర్వహిస్తున్న *‘మన జిల్లా – మన రామగిరి ఖిల్లా’* వాకింగ్, ట్రెక్కింగ్ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష(District Collector Koya Sri Harsha) పిలుపునిచ్చారు.
మంగళవారం పెద్దపల్లిలో ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 18వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటలకు బేగంపేట గ్రామం నుంచి ట్రెక్కింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు రామగిరి ఖిల్లా ప్రకృతి అందాలను ఆస్వాదించడంతో పాటు అక్కడి చారిత్రక విశేషాలను తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.
రిజిస్ట్రేషన్ తప్పనిసరి
ట్రెక్కింగ్‌లో పాల్గొనాలనుకునే ఆసక్తిగల వారు పోస్టర్‌పై ఉన్న సంకేత చిత్రాన్ని స్కాన్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. ప్రకృతి ప్రేమికులు, యువత, చరిత్రపై ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అటవీ సంపదను కాపాడాలి
ట్రెక్కింగ్ సమయంలో అటవీ ప్రాంతంలోని చెట్లు, మొక్కలు, ఇతర వృక్షసంపదకు నష్టం కలిగించకుండా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్వాహకులు సూచించారు. రామగిరి ఖిల్లా వంటి చారిత్రక ప్రదేశాల ప్రాధాన్యతను భావితరాలకు అందించేందుకు వాటి పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏజే పెడల్స్ సైకిల్స్‌కు చెందిన అఖిల్ రెడ్డి, మాజీ సైనికుడు, అంతర్జాతీయ పర్వతారోహకుడు లెంకల మహిపాల్ రెడ్డి, పెద్దపల్లి యువశక్తి సామాజిక మాధ్యమ ప్రతినిధి అనిల్ తదితరులు పాల్గొన్నారు.