అటవీ భూమిలో పోడు సాగు యత్నం అడ్డుకట్ట
బూర్గంపాడు,(విజయక్రాంతి): అటవీ భూమిని(Forest land) పోడు సాగులోకి(Podu cultivation) మార్చేందుకు చేపట్టిన ప్లవింగ్ పనులను(Ploughing works) అటవీ అధికారులు అడ్డుకున్నారు. అశ్వాపురం అటవీ రేంజ్ పరిధిలోని కృష్ణసాగర్(Krishna Sagar) ఆర్‌ఎఫ్, కంపార్ట్‌మెంట్ నంబర్ 225లోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం బీట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.డోజర్ ట్రాక్టర్ (టీఎస్ 05 యూడీ 7803)తో ప్లవింగ్ చేస్తున్న చక్క ఈశ్వరయ్య, ట్రాక్టర్ డ్రైవర్ కమ్ ఓనర్ ఇనపెంగి నాగరాజును అటవీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
సుమారు 0.10 హెక్టార్ల విస్తీర్ణంలో 201 క్యూబిక్ మీటర్ల మేర భూమిని దున్నినట్లు గుర్తించారు. ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని అటవీ చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు. నిందితులతో పాటు ట్రాక్టర్‌ను న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు అధికారులు తెలిపారు. అటవీ భూముల ఆక్రమణ, అనధికార సాగు, భూమి స్వరూపాన్ని మార్చే చర్యలను అడ్డుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.