సబ్సిడీపై శనగ
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
షాబాద్,(విజయక్రాంతి): యాసంగి 2026–27 సీజన్(Yasangi 2026-27 season)కు సంబంధించి మిషన్ ఫర్ ఆత్మనిర్భర్త ఇన్ పల్సెస్ (Mission for Atmanirbharata in Pulses) కార్యక్రమం కింద శనగ NBeG-452 రకం విత్తనాలు సబ్సిడీపై అందుబాటులో ఉన్నాయని షాబాద్ మండల(Shabad Mandal) వ్యవసాయ అధికారి దండెం విజయచంద్ర తెలిపారు. శనగ విత్తనాలు కావాల్సిన రైతులు పట్టాదారు పాస్‌బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని షాబాద్ రైతు వేదికలో తమ తమ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని సూచించారు. అర్హత మేరకు సబ్సిడీపై విత్తనాలు పొందవచ్చని తెలిపారు.
తక్కువ నీటితో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం
యాసంగి సీజన్(Yasangi season)లో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఎల్‌నినో పరిస్థితులు బలపడే అవకాశం ఉన్నందున, సాగునీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వరి సాగు విషయంలో రైతులు జాగ్రత్తగా వ్యవహరించాలని వ్యవసాయ అధికారి సూచించారు. నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని కుసుమ, శనగ, జొన్న, నువ్వులు, ఇతర కూరగాయల వంటి తక్కువ నీటితో సాగు చేసే ఆరుతడి పంటలను ఎంపిక చేసుకోవాలని కోరారు. భూసారం, నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సరైన పంటను ఎంచుకుని సాగు చేయడం ద్వారా రైతులు ప్రయోజనం పొందవచ్చని తెలిపారు.