మొరంపల్లి బంజర్‌లో గాలివాన బీభత్సం
చీకట్లు కమ్ముకుని దుమ్ముతో భయానక వాతావరణం.. ఎగిరిపడ్డ రేకులు, నేలకూలిన చెట్లు
బూర్గంపాడు, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర్, మర్రికుంట, వేపలగడ్డ గ్రామాల్లో బుధవారం సాయంత్రం బలమైన గాలులు బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై చీకట్లు కమ్ముకోవడంతో పాటు భారీగా దుమ్ము లేవడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.
గాలుల ధాటికి భారీ చెట్లు నేలకూలగా.. ఇళ్లు, దుకాణాలపై ఉన్న రేకులు, ఇతర సామగ్రి ఎగిరిపడ్డాయి. బయట ఉన్న కొందరు గాలి తీవ్రతకు నెట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. పలువురు భయంతో పరుగులు తీశారు. కొందరికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
కళ్లముందే ఎగిరిపడ్డాయి..
“ఒక్కసారిగా చీకట్లు కమ్ముకున్నాయి. భారీగా దుమ్ము లేవడంతో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కళ్లముందే చెట్లు, రేకులు గాలికి ఎగిరిపడ్డాయి” అని స్థానికులు తెలిపారు.
నష్టంపై పరిశీలన
గాలివానతో విద్యుత్ సరఫరా, ఇళ్లు, పంటలు, ఇతర ఆస్తులకు జరిగిన నష్టంపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాల్సి ఉంది. స్థానికులు దీనిని సుడిగాలిగా పేర్కొంటున్నప్పటికీ.. ఇది టోర్నాడోనా? కాదా? అనేది అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.