దళిత స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచేటు
- తాతా మధును బర్తరఫ్ చేయాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య డిమాండ్
ఇల్లెందు, (విజయక్రాంతి): అసెంబ్లీ స్పీకర్, దళిత నేత గడ్డం ప్రసాద్‌కుమార్(Gaddam Prasad Kumar)పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు(MLC Tata Madhu) చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగబద్ధమైన, అత్యున్నత హోదాలో ఉన్న స్పీకర్‌ను వ్యక్తిగతంగా కించపరచడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని మండిపడ్డారు. దళిత బిడ్డ ఉన్నత పదవిలో ఉండటాన్ని జీర్ణించుకోలేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. తాతా మధు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఆయనను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తాతా మధు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. “స్పీకర్‌ను అవమానిస్తే సహించేది లేదు” అంటూ నినాదాలు చేశారు.