అసభ్య వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీని వెంటనే బర్తరఫ్ చేయాలి
అసభ్య వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీని వెంటనే బర్తరఫ్ చేయాలి
కరీంనగర్,(విజయ క్రాంతి): నిన్న హైదరాబాద్ అసెంబ్లీ వద్ద శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad Kumar)పై బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అసభ్యకర, అభ్యంతరకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్(Munnur Kapu Corporation) చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి అన్నారు. కరీంనగర్ లోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి మాట్లాడుతూ.ఒక పక్క భారతీయులు టెక్నాలజీ పరంగా తమ మేధో శక్తితో దేశానికి గర్వకారణంగా నిలుస్తుంటే, మరో పక్క బీఆర్ఎస్ నాయకులు 500 ఏళ్ల నాటి కుల వివక్షను మళ్లీ చూపిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు దళితుడైన స్పీకర్ గడ్డం ప్రసాద్ పట్ల మీడియా ముందు చెప్పలేని అసభ్య పదజాలంతో దూషించడం సిగ్గుచేటు. నేడు కూడా అసెంబ్లీలోకి వచ్చి అదే అహంకారంతో ప్రవర్తించడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే.
రెండున్నరేళ్లు ప్రతిపక్షంలో ఉండగానే బీఆర్ఎస్ నాయకులకు సహనం నశించింది. ప్రజలు వారిని ప్రతిపక్షానికి పరిమితం చేసిన తీర్పును జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో అసెంబ్లీని కేవలం 48 రోజులు, 36 గంటలు మాత్రమే నడిపి ప్రతిపక్ష గొంతు నొక్కిన చరిత్ర వారిది. ఒక దళిత నాయకుడు సీఎల్పీ లీడర్ గా ఉన్నారని జీర్ణించుకోలేక వారి ప్రభుత్వ హయాంలో సీఎల్పీ ని ముక్కలు చేసి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత లేకుండా చేశారు. దళితులకు 3 ఎకరాల భూమి, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని మోసం చేసిన చరిత్ర బీఆర్ఎస్ ది.
నిన్న అసెంబ్లీ ముందు జరిగిన డ్రామా అంతా కెసిఆర్ ఫామ్ హౌస్(KCR Farm House)లో వేసిన స్కెచ్ ప్రకారమే జరిగింది. మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ముందు పెట్టుకుని డ్రామాలు చేసే నీచ రాజకీయం కే చెల్లుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే, దానిని జీర్ణించుకోలేక ప్రజల నుండి వస్తున్న స్పందన ను ఓర్వలేక ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే పథకం ప్రకారం వచ్చారు. కానీ వారి పథకం బెడిసికొట్టింది.
4 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన వారికి అసెంబ్లీకి నల్ల దుస్తులతో రాకూడదని తెలియదా నల్ల దుస్తులు బయట నిరసనకు వేసుకోవాలి, ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీలోకి కాదు. అది తప్పు అని చెబితే మహిళా కానిస్టేబుల్ ముందు దుస్తులు విప్పేసి ఇబ్బంది పెట్టడం అత్యంత దారుణం, అహంకారపూరిత చర్య. ఇదంతా రికార్డ్ అయి ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను గౌరవించి పదవులు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. దానికి నిదర్శనమే దళిత బిడ్డలకు డిప్యూటీ సీఎం, స్పీకర్ పదవులు, ఈ జిల్లాలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి పదవి ఇవ్వడం.
ఇటీవల రాజ్యసభ ప్రతిపక్ష నేత, ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సభ నిర్వహించిన స్థలాన్ని బీజేపీ.ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు శుద్ధి చేయడం వారి కుల వివక్షకు నిదర్శనం. అక్కడ బీజేపీ ఇక్కడ బీఆర్ఎస్ - ఇద్దరి తీరు ఒకటే. కేటీఆర్ మాటల్లో దొర అహంకారం, బలుపు స్పష్టంగా కనిపిస్తోంది. నాయకుడు ఎలా ఉంటే కింది నాయకులు అలాగే ఉంటారు. నాలుగైదు సార్లు గెలిచిన స్పీకర్ స్థాయి వ్యక్తిని అంత మాట అనడం అంటే, ఎన్ని పదవులు వచ్చినా దళితులపై వారి చిన్నచూపు పోలేదని అర్థం.
కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వెంటనే తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుండి బర్తరఫ్ చేయాలి. కెసిఆర్ దళిత జాతి యావత్తుకు, సభ్య సమాజానికి క్షమాపణ చెప్పాలి. లేకపోతే బలహీన వర్గాల సమాజం బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకుంటుంది. తాతా మధు రాజీనామా చేసే వరకు మా పోరాటం ఆగదు" అని అన్నారు. కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ నిన్న బి ఆర్ ఎస్ నేతలు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి పట్ల ప్రవర్తించిన తీరును కార్పొరేషన్ కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం.
తాత మధు అనే ఎమ్మెల్సీని వెంటనే భర్త రఫ్ చేయాలని వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసి జైలుకు పంపించాలని మేమంతా ఏకగ్రీవంగా ముక్తకంఠంతో తీర్మానం చేస్తున్నాము. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలకు దగ్గరవుతున్న తరుణంలో ఇంకా దేశంలో బిజెపి రాష్ట్రంలో బిఆర్ఎస్ కుల వివక్షకు పాల్పడుతుంది, ఇది నిజంగా సిగ్గుచేటు, మన భారతదేశం ప్రపంచ దేశాలతో అభివృద్ధిలో పోటీపడుతున్న ఈ రోజుల్లో ఈ విధంగా దళిత ప్రజాప్రతినిధుల పట్ల కుల వివక్ష తో దూషణలు చేయడం క్షమించరానిది. దీనిని ఏమాత్రం ఉపేక్షించకూడదు ఇది మన భారతదేశానికే అవమానకరం అని అన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ వరాల నరసింగం, నగర కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు అహమ్మద్ అలీ, కాంగ్రెస్ నాయకులు జీడి రమేష్, చింతల కిషన్, మాదాసు శ్రీనివాస్, బొమ్మరాతి సాయికృష్ణ, కూడలి శ్రీధర్, తిరుపతి, ముద్దసాని క్రాంతి, పెంట శేఖర్ తదితరులు పాల్గొన్నారు.