జర్నలిస్టుల ఇండ్ల స్థలాల హామీ నెరవేరేది ఎన్నడు?
యెర్రా కామేష్
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్...
కొత్తగూడెం అక్టోబర్ 2 (విజయక్రాంతి): జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయిస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి, వెంటనే నెరవేర్చాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అడ్వకేట్ యెర్రా కామేష్(JBP State Working President Yerra Kamesh) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శుక్రవారం జిల్లా కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు చేపట్టిన నిరసన దీక్షకు మద్దతు తెలిపి కామేష్ మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కూడా కీలకంగా కొనసాగిందని గుర్తు చేశారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వారికి ఇంటి స్థలాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చి 3సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు ఆ ఊసే ఎత్తడం లేదని,ఇది సరైన పద్ధతి కాదని మండి పడ్డారు.
ప్రభుత్వానికీ ప్రజలకు మధ్య వారిదిగా పని చేస్తూ వృత్తి పరంగా అనేక ఒడి దుడుకులు ఎదుర్కొంటున్న విలేఖరులు జీత,భత్యాలు లేక కుటుంబాలకు విద్యా,వైద్యం అందించలేక ఆర్థికంగా చితికి పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఇళ్ల స్థలాలు,ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని,లేనియెడల భవిష్యత్ లో జర్నలిస్టులు రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని,జేబీపీ పార్టీ జర్నలిస్టుల పోరాటాలకు పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు,జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ వీరు నాయక్,వినయ్,పుట్ట.లాలిబాబు తదితరులు పాల్గొన్నారు.