ఉపాధి హామీ జాబ్‌ కార్డులు మంజూరు

27-10-2026 | 11:23am

15 కుటుంబాలకు కార్డులు.. ఉపాధి హామీ పథకంపై అవగాహన

టేకులపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు టేకులపల్లి మండలంలోని ఆదివాసీ గుత్తికోయ గ్రామాలైన గంగారం గ్రామపంచాయతీ పరిధిలోని సిద్దారం, చింతోనిచిలక గ్రామపంచాయతీ పరిధిలోని సర్వాయి బోడు గ్రామాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నల్లమోతు రవికుమార్ పర్యటించారు. ఆయా గ్రామాల్లో జాబ్‌ కార్డులు లేని 15 కుటుంబాల నుంచి దరఖాస్తులు స్వీకరించి కార్డులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కుటుంబానికి ఏడాదికి 125 రోజుల పని కల్పించే పథకం ద్వారా, పని కొలతల ప్రకారం రోజుకు రూ.308 చొప్పున గరిష్ఠంగా రూ.38,500 వరకు వేతనం పొందవచ్చని వివరించారు.

తమ భూముల్లో ఫామ్‌ పాండ్లు, చెరువుల పూడికతీత, ఇంకుడు గుంతల నిర్మాణం సహా వివిధ రకాల పనులను చేపట్టి ప్రయోజనం పొందాలని సూచించారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి, ఇంకుడు గుంత నిర్మించుకోవాలని కోరారు. రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో కరువు తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గంగారం సర్పంచ్ ఇర్ప రుక్మిణి, ఉపసర్పంచ్ కోర్స చుక్కమ్మ, చింతోనిచిలక సర్పంచ్ మెట్ల తులసమ్మ, డీఆర్ డీఏ ఏపీడీలు విజయభాస్కర్‌రెడ్డి, రమణ, రాజు, ఏపీఓ కాళంగి శ్రీనివాస్, ఈసీ తిరుపతయ్య, పంచాయతీ కార్యదర్శులు సునీల్‌కుమార్, అనిల్‌కుమార్, టీఏ రమణ, ఎఫ్‌ఏ సరిత తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు