సక్రమాల మాటున అక్రమాలెన్నో!

27-11-2026 | 05:20am
  1. పేరుకు వ్యాపారాలు.. తెరవెనుక చీకటి దందాలు!
  2. ప్రజల అమాయకత్వమే పెట్టుబడిగా అక్రమ సంపాదన?
  3. వ్యాపారాల్లో నష్టాలంటూ ఐపీ దాఖలు.. అసలు లెక్కలపై అనుమానాలు!
  4. మణుగూరులో చక్రం తిప్పుతున్న ఆ రారాజు ఎవరు?

మణుగూరు, నవంబర్ 26 (విజయక్రాంతి): సక్రమ వ్యాపారాల ముసుగులో అసలు కథ వేరేలా సాగుతోందా? మణుగూరు(Manuguru) పట్టణంలో కొందరు వ్యక్తుల వ్యవహారశైలి ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారుతోంది. బయటకు సమాజంలో పెద్దమనుషులుగా గుర్తింపు పొందుతూ, వ్యాపారులుగా చెలామణి అవుతున్న కొందరి వెనుక అనేక అనుమానాస్పద లావాదేవీలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొందరు తమ స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

వ్యాపారాల పేరుతో పరిచయాలు పెంచుకోవడం, నమ్మకం సంపాదించడం, ఆ తర్వాత ఆర్థిక లావాదేవీల్లో ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం వంటి వ్యవహారాలపై బాధితుల్లో ఆందోళన నెలకొంటోంది.మరోవైపు వ్యాపారాల్లో నష్టాలు వచ్చాయంటూ ఐపీ దాఖలు చేసే వారి వ్యవహారాలపైనా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజంగానే వ్యాపార నష్టాలా? లేక అప్పుల నుంచి తప్పించుకునేందుకు ఆ మార్గాన్ని ఎంచుకుంటున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తులుగా చెలామణి అవుతూ తెరవెనుక ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అంశంపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మణుగూరులో కొందరి వ్యవహారాల వెనుక అసలు సూత్రధారులు ఎవరు? వారికి అండగా నిలుస్తున్నదెవరు? ప్రజల నుంచి సేకరించిన డబ్బుల లెక్కలేంటి? వ్యాపారాల పేరుతో సాగుతున్న లావాదేవీల్లో పారదర్శకత ఉందా? అనే ప్రశ్నలు ఇప్పుడు పట్టణంలో చర్చకు దారితీస్తున్నాయి.

అధికారులు స్పందించి అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు, ఐపీ దాఖలాల వెనుక ఉన్న వాస్తవాలను నిగ్గుతేల్చాలని ప్రజలు కోరుతున్నారు. సక్రమాల ముసుగులో అక్రమాలు సాగుతుంటే వాటికి అడ్డుకట్ట వేసేదెవరు? మణుగూరులో చక్రం తిప్పుతున్న ఆ రారాజు ఎవరు? అన్నది వేచి చూడాల్సిందే!

మరిన్ని వార్తలు