దుమ్ముగూడెం ఆనకట్ట నీటి నిల్వ పెంచాలి
అశ్వాపురం, అక్టోబర్ 19 (విజయక్రాంతి): రానున్న వేసవిలో మూడు జిల్లాల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద నీటి నిల్వ పెంపునకు తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) అధికారులను ఆదేశించారు.
సోమవారం అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి పరిధిలోని ఆనకట్టను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్‌తో కలిసి పరిశీలించారు. ఆనకట్ట పూర్తి నిల్వ సామర్థ్యం 0.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.5 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసుకునే అవకాశం ఉందన్నారు. సాంకేతిక అంశాలను పరిశీలించి సుమారు మీటరు ఎత్తున ఇసుక బస్తాలు ఏర్పాటు చేయడం ద్వారా నీటి నిల్వను పెంచేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించారు. తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇచ్చి, మిగులు నీటిని మాత్రమే ఇతర అవసరాలకు వినియోగించాలన్నారు.
సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతుల సాధనకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అనుమతులు రాగానే నవంబర్ నుంచి నిర్మాణ పనులు ప్రారంభించేలా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో రానున్న వేసవిలో నీటి కొరత ఏర్పడే అవకాశమున్నందున రైతులు నీటి లభ్యతను బట్టి తక్కువ వ్యవధి, తక్కువ నీరు అవసరమయ్యే పంటలను ఎంచుకోవాలని సూచించారు. ప్రజలు సైతం తాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, నీటిపారుదల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.