ఘనంగా ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం
దమ్మపేట, అక్టోబర్ 05 (విజయక్రాంతి): ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని అశ్వారావుపేట నియోజకవర్గంలో గత విద్యాసంవత్సరంలో పదో తరగతి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ(MLA Jare Adinarayana) ఆధ్వర్యంలో గండుగులపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడం వెనుక ఉపాధ్యాయుల కృషి, అంకితభావం ఎంతో కీలకమని అన్నారు. విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించడంతో పాటు వారిలో క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం ఉన్నత లక్ష్యాలను పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తున్న ఉపాధ్యాయుల సేవలను గుర్తించి గౌరవించడం మనందరి బాధ్యత అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు కూడా ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మంచి ఫలితాలు సాధిస్తున్నారని ఇందుకు ఉపాధ్యాయుల కృషి ప్రధాన కారణమని తెలిపారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో విద్యకు విద్యార్థుల భవిష్యత్తుకు మరింత ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యేజారే స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి ఉన్నతంగా ఎదగాలనే లక్ష్యంతో పాఠశాలల్లో అవసరమైన వసతుల కల్పనకు విద్యా ప్రమాణాల పెంపునకు తన వంతు సహకారం అందిస్తున్నానని ఇంకా అందిస్తానని తెలిపారు.
గత విద్యాసంవత్సరంలో పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించి పాఠశాలలకు మంచి పేరు తీసుకువచ్చిన ప్రధానోపాధ్యాయులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో మరిన్ని మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట ఎంఈఓ జగపతి రావు, ములకలపల్లి ఎంఈఓ సత్యనారాయణ, అశ్వరావుపేట ఎంఈఓ ప్రసాద్ రావు, చండ్రుగొండ ఎంఈఓ సూరయ్య, మాజీ ఎంఈఓ కీసరి లక్ష్మీ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.