అణగారిన వర్గాల అభ్యున్నతి కృషి చేసిన మహనీయుడు కాకా
- డీసీపీ ఎగ్గడి భాస్కర్
మంచిర్యాల టౌన్: కార్మికుల, పేదల, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు, కార్మిక పక్షపాతి, సామాజిక సేవకుడు గడ్డం వెంకటస్వామి (Gaddam Venkatswamy) అని డీసీపీ ఎగ్గడి భాస్కర్(DCP Bhaskar) అన్నారు. సోమవారం గడ్డం వెంకటస్వామి (కాకా) జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ లో షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి చాతరాజుల దుర్గాప్రసాద్, డీ ఆర్ డీ ఓ కిషన్, డీడబ్ల్యూఓ రౌఫ్ ఖాన్, జిల్లా అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ అధికారి నీరటి రాజేశ్వరి, జిల్లా కార్మిక శాఖ అధికారి క్రాంతి, వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి హాజరై గడ్డం వెంకటస్వామి (కాకా) చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా డి.సి.పి. మాట్లాడుతూ గడ్డం వెంకటస్వామి (కాకా) కార్మిక పక్షపాతిగా, దేశ ప్రగతికి కార్మికులే పునాది అనే బలమైన విశ్వాసంతో పనిచేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. జాతీయ గుడిసెల సంఘం ద్వారా గుడిసెలలో జీవిస్తున్న పేద ప్రజలకు నివాస సౌకర్యం కల్పించేందుకు కృషి చేశారని, దాదాపు 30 కాలనీలలో ఇళ్ల ఏర్పాటుకు చేసిన కృషి పేద ప్రజల జీవితాలలో గణనీయమైన మార్పును తీసుకువచ్చిందన్నారు. ప్రతి ఒక్కరికీ విద్య అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు, పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని తెలిపారు. దేశంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, కాకా వెంకటస్వామి పేర్లు సార్వజనీన సంక్షేమం కోసం చేసిన సేవలకు చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు.