సీతారామ జలాల కోసం క్షేత్రస్థాయిలో పరిశీలన

04-10-2026 | 04:59pm

ఇల్లెందు, (విజయక్రాంతి): ఇల్లందు, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలకు(Illandu, Mahabubabad, and Dornakal constituencies) సాగు, తాగునీరు(Irrigation and drinking water) అందించేందుకు సీతారామ ప్రాజెక్టు(Sitarama Project) నీటిని ఎత్తిపోసే ప్రాంతాన్ని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్(Mahabubabad MLA Bhukya Murali Naik) ఆదివారం పరిశీలించారు. వైరా నియోజకవర్గం కారేపల్లి మండలం చీమలపాడు గ్రామ సరిహద్దులోని పాపకొల్లు గండ్ల వద్ద ఏర్పాటు చేయనున్న పంపింగ్ లిఫ్ట్ ప్రాంతాన్ని కాలినడకన వెళ్లి పరిశీలించారు. నీటిపారుదల అధికారులతో కలిసి మ్యాప్‌ను పరిశీలించి నీరు పారే మార్గాలపై సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కనకయ్య మాట్లాడుతూ.. మూడు నియోజకవర్గాలకు నీరు అందించే ప్రతిపాదనను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినట్లు తెలిపారు. గతంలో ఇచ్చిన హామీలు అమలుకాలేదని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల దృష్టికి సమస్యను తీసుకెళ్లి త్వరితగతిన నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇల్లందు, మహబూబాబాద్, డోర్నకల్ ప్రాంతాలకు సీతారామ జలాలను అందించడమే లక్ష్యమన్నారు.

కార్యక్రమంలో చీమలపాడు సర్పంచ్ మాలోత్ లలిత బావుసింగ్, మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ జ్యోతి రమేష్, బయ్యారం మాజీ సొసైటీ చైర్మన్ మూల మధుకర్‌రెడ్డి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకుడు తోటకూరి శివయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గబ్రు నాయక్, బయ్యారం మాజీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వెల్పుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు