జింకలగూడెం గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
బూర్గంపాడు, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్(DSP Satish Kumar) ఆధ్వర్యంలో బూర్గంపహాడ్ మండలం జింకలగూడెం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. డాగ్ స్క్వాడ్ బృందాలతో గ్రామంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 41 వాహనాలను గుర్తించారు. వీటిలో బైక్‌లు, ఆటోలు, ఒక బొలెరో వాహనం ఉన్నాయి. వాహనాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించి నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. సమాజానికి హానికరమైన మూఢనమ్మకాలు, చేతబడి వంటి వాటికి ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి వినియోగం, అక్రమ రవాణా వల్ల కలిగే దుష్ప్రభావాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గంజాయి అక్రమ రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు.అలాగే పశువుల అక్రమ రవాణా, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, డాగ్ స్క్వాడ్ బృందాలతో కలిపి సుమారు 50 మంది పోలీసులు పాల్గొన్నారు.