విధి నిర్వహణలో ఎస్సై కున్సోత్ వెంకన్న మృతి
గణేష్ నిమజ్జన బందోబస్తులో విషాధం
మృతుడుకొత్తగూడెం టూ టౌన్ ఎస్సై
ప్రగాఢ సంతాపం తెలియజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్
కొత్తగూడెం,(విజయక్రాంతి): విధి నిర్వహణలో భాగంగా వినాయక చవితి బందోబస్తు విధులు నిర్వహిస్తున్న సమయంలో, రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన కొత్తగూడెం 2 టౌన్ పోలీస్ స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ కుంశోత్ వెంకన్న (57) మృతి పట్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు(SP Rohit Raj) ఐపీఎస్, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి ప్రగాఢ సంతాపం తెలిపారు. వివరాల్లోకి వెళితే.. బుధవారం నాడు తెల్లవారుజామున సుమారు 02:00 గంటల సమయంలో హైదరాబాద్‌లోని సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో, ట్యాంక్‌బండ్ ప్రాంతంలోని ఎన్టీఆర్ గార్డెన్ మార్గంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి సమీపంలో వినాయక చవితి బందోబస్తు విధులు నిర్వహిస్తున్న సమయంలో రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని ద్విచక్ర వాహనదారుడు అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ వెంకన్నను ఢీకొట్టాడు.
ప్రమాదం జరిగిన వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గాయాల తీవ్రత కారణంగా బుధవారం సాయంత్రం 17:40 గంటలకు చికిత్స పొందుతూ మృతి చెందారు. వెంకన్న మరణ వార్త విన్న, కొత్తగూడెం టు టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తీవ్ర మైన దిగ్బ్రాంతికి లోనయ్యారు. వెంకన్న మృతి పోలీస్ శాఖకు తీరని లోటని ఎస్పీ తెలిపారు. ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆయన కుటుంబ సభ్యులకు కల్పించాలని, మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.వెంకన్న కుటుంబానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖ అండగా ఉంటుందని ఎస్పీ భరోసా ఇచ్చారు.