జేకే–5 ఓసీపీలో స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్–6

17-10-2026 | 04:09pm

- పరిసరాల పరిశుభ్రతతోనే సురక్షిత పని వాతావరణం

ఇల్లెందు,(విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియాలోని జేకే–5 ఓసీపీ(Singareni Illandu Area JK-5 OCP)లో స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్–6 కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఎన్విరాన్‌మెంట్ అధికారి నరసింహారావు(Environment Officer Narasimha Rao) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ వి. కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓసీపీలోని స్క్రాప్ యార్డు, ఇతర పని ప్రదేశాలను పరిశీలించిన ఆయన.. పేరుకుపోయిన చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు, పొదలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా జీఎం వి. కృష్ణయ్య మాట్లాడుతూ.. స్వచ్ఛత ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని, కార్యాలయాలు, గనులు, పని ప్రదేశాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు, పొదలు పేరుకుపోవడం వల్ల పాములు, విషపురుగులు సంచరించే ప్రమాదం ఉందని, ఇది కార్మికులు, ఉద్యోగుల భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. స్క్రాప్‌ను క్రమపద్ధతిలో నిల్వ ఉంచడంతోపాటు పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు.

స్వచ్ఛత కార్యక్రమాలు ప్రత్యేక ప్రచారాలకే పరిమితం కాకుండా నిత్యకృత్యంగా కొనసాగాలని, ప్రతి ఉద్యోగి పరిశుభ్రతను అలవాటుగా మార్చుకోవాలని ఆయన అన్నారు. పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యానికి, సురక్షితమైన పని వాతావరణానికి దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓటు జీఎం జాకీర్ హుస్సేన్, డీజీఎం (పర్సనల్) అజ్మీర్ తుకారాం, జేకే మేనేజర్ పులి పూర్ణచందర్, జేకే ఎస్‌ఓ శివప్రసాద్‌తో పాటు ఇతర అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు