పాల్వంచలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్
పాల్వంచ,(విజయక్రాంతి): పట్టణంలోని నవభారత్ నుంచి ఇందిరాకాలనీ వరకు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్(Special sanitation drive ) నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలతో పాటు సెంటర్ డివైడర్‌ను పూర్తిస్థాయిలో శుభ్రం చేసే కార్యక్రమాన్ని మేయర్ ,డిప్యూటీ మేయర్ స్వయంగా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులతో పాటు మున్సిపల్ శానిటేషన్ అధికారులు అశోక్ చౌహాన్ గ పాల్గొన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే లక్ష్యంతో మున్సిపల్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేపట్టారు.
అదేవిధంగా రోడ్డు మధ్యలో ఉన్న మొక్కలను పరిరక్షించడం, వాటికి క్రమం తప్పకుండా నీరు అందించడం వంటి అంశాలపై కూడా మేయర్, డిప్యూటీ మేయర్ ప్రత్యేక దృష్టి సారించారు. కార్మికులతో కలిసి దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తూ, శుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. పాల్వంచ పట్టణాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో తీర్చిదిద్దేందుకు మున్సిపాలిటీ చేపడుతున్న ఈ ప్రత్యేక డ్రైవ్‌పై ప్రజలు కూడా సహకరించి చెత్తను రోడ్లపై వేయకుండా, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు.






