స్వచ్ఛతతోనే సమర్థవంతమైన సేవలు

03-10-2026 | 06:19pm

ఇల్లందు ఏరియాలో స్వచ్ఛతా స్పెషల్ క్యాంపెయిన్–6 ప్రారంభం

ఇల్లెందు , (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం(Central Government), కోల్‌ మంత్రిత్వ శాఖ(Ministry of Coal) ఆదేశాల మేరకు సింగరేణి(Singareni) వ్యాప్తంగా అక్టోబర్‌ 2 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న స్వచ్ఛతా స్పెషల్ క్యాంపెయిన్ – 6ను ఇల్లందు ఏరియాలో శుక్రవారం ప్రారంభించారు. ఎన్విరాన్‌మెంట్ అధికారి నరసింహారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏరియా జనరల్‌ మేనేజర్‌ వి. కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. స్వచ్ఛత అంటే కార్యాలయాలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా పారదర్శకత, సమయపాలన, క్రమశిక్షణ, సమర్థవంతమైన పని విధానం కూడా స్వచ్ఛతలో భాగమని తెలిపారు. ప్రతి ఉద్యోగి తన పని ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పెండింగ్‌ ఫైళ్లు, ఉద్యోగుల సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. అనవసర రికార్డులు, వ్యర్థాలను తొలగించి కార్యాలయాలను క్రమబద్ధీకరించాలని, ఉద్యోగులు, ప్రజలకు పారదర్శకంగా సౌకర్యవంతమైన సేవలు అందించాలని కోరారు. స్వచ్ఛతను ఒక కార్యక్రమంగా కాకుండా రోజువారీ విధానంలో భాగంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు.

అనంతరం అధికారులు, ఉద్యోగులతో స్వచ్ఛతా స్పెషల్‌ క్యాంపెయిన్‌–6 ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఏరియా సేఫ్టీ ఆఫీసర్‌ రామదాసు, డీజీఎం (పర్సనల్‌) అజ్మీర్‌ తుకారాం, డీజీఎం (ఫైనాన్స్‌) నాగలక్ష్మి, డీవైఎస్‌సీ (సివిల్‌) వినయ్‌ సాగర్‌, ఏరియా సర్వే అధికారి రామమూర్తి, ఎస్టేట్‌ అధికారి శివవీరకుమార్‌, ఐటీ అధికారి చైతన్య, సీనియర్‌ పర్సనల్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ సెల్‌ అధికారి జి. సుధాకర్‌తో పాటు ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు