సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తే ఊరుకోం
24 లక్షల ఎకరాల భూపంపిణీ చేసిన ఘనత కమ్యూనిస్టులదే
అమరవీరుల ఆశయ సాధనకు పునరంకితం కావాలి
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట(Telangana Farmers Armed Struggle ) చరిత్రను మత రంగు పులిమి వక్రీకరించే మతోన్మాద శక్తుల కుట్రలను తిప్పికొట్టాలని, తెలంగాణ అమరుల నిజమైన త్యాగాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సిపిఐ(CPI) జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా పిలుపునిచ్చారు. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని 'శేషగిరి భవన్' జిల్లా కార్యాలయంలో గురువారం తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభ, తెలంగాణ విలీన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తొలుత ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో సాబీర్ పాషా మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17ను ప్రభుత్వాలు అధికారికంగా తెలంగాణ విలీన దినోత్సవంగా ప్రకటించాలని, భావితరాలకు తెలిసేలా చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. నిజాం నిరంకుశ పాలనపై, భూస్వాముల వెట్టిచాకిరీ, దోపిడీకి వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటానికి కమ్యూనిస్టు పార్టీయే ముందుండి నాయకత్వం వహించిందని స్పష్టం చేశారు. దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, షేక్ బందగీ, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దూం మొహియుద్దీన్ వంటి వీరుల నాయకత్వంలో 4,500 మంది ప్రాణాలర్పించి తెలంగాణను విముక్తి చేశారని గుర్తుచేశారు.