రోడ్డున పడ్డ మూగ జీవాలకు ఆశ్రయం
మూగజీవులకు గూడు కల్పించడానికి ముందుకు వచ్చిన యువ వ్యాపారవేత్త విక్రమ్
భద్రాచలం,(విజయక్రాంతి): ఆకలి అల్లాడే కడుపులు. కాపాడేవారు లేక రోడ్లపై తిరిగే మూగజీవాలకు ఆశ్రయం(Build Cow Shelter) కల్పించడానికి యువ వ్యాపారవేత్త విక్రమ్(Young entrepreneur Vikram) అతని స్నేహితులు ముందుకు వచ్చారు. ప్రతిరోజు పట్టణంలోని ప్రధాన వీధులలో వేగంగా దూసుకొచ్చే వాహనాల చక్రాల కింద నలిగిపోయి ప్రాణాలు కోల్పోతున్న మూగజీవాలను చూసి చలించి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. భద్రాచలం(Bhadrachalam) పుణ్యక్షేత్రం వీధుల్లో నిత్యం కనిపించే ఈ హృదయ విదారక దృశ్యాలు ఆ వ్యాపారవేత్త అతని స్నేహితుల మనసును కలచివేశాయి.
రోడ్డు ప్రమాదాల్లో కాళ్లు విరిగి, రక్తమోడుతూ అనాథ శవాలుగా మారుతున్న గోవులను, మూగజీవాలను కాపాడేందుకు ‘విక్రమ్ సూపర్ మార్కెట్’ అధినేత విక్రమ్ అతని మిత్రులు నడుం బిగించారు. రోడ్లనే ఆవాసంగా చేసుకుని బతుకులీడుస్తున్న నిరాశ్రయ మూగజీవుల రక్షణ కోసం భద్రాచలంలో శాశ్వతంగా ఒక ఆదర్శవంతమైన ‘గోశాల’ ఏర్పాటు చేయాలని ఆయన సంకల్పించారు. ఈ బృహత్తర సంకల్పానికి సంబంధించి పట్టణంలోని జంతు ప్రేమికులతో కలిసి ఆయన సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ... రోడ్లపై తిరుగుతూ వాహనాలు ఢీకొని నిత్యం అనేక గోవులు, మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి.
ఎన్నో జీవాలు క్షతగాత్రులై రోడ్ల పక్కన ఆర్తనాదాలు చేస్తున్నాయి. వాటి కష్టాలను చూస్తూ ఇంకా మౌనంగా ఉండలేకపోతున్నాం. అందుకే వాటికి నీడను, ఆహారాన్ని, అవసరమైన వైద్య చికిత్సను అందించేందుకు ఒక ప్రత్యేక గోశాల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నాం" అని ఉద్వేగంగా తెలిపారు. సమాజంలో మూగజీవుల పట్ల చూపే కారుణ్యమే నిజమైన భక్తి అని, త్వరలోనే ఈ గోశాల నిర్మాణాన్ని పట్టణవాసుల సహకారంతో పూర్తి చేసి రోడ్లపై ఉన్న ప్రతి జీవికీ రక్షణ కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సాగర్ , శర్మ , లావణ్య పాల్గొన్నారు.