సాయుధ పోరాట అమరుల త్యాగాలు వృధాకానివ్వం!
సాయుధ పోరాటంలో బిజెపి, ఆర్ఎస్ఎస్ పాత్ర శూన్యం
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అడుసుమిల్లి సాయిబాబా
సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విలీన దినోత్సవం
పాల్వంచ, (విజయక్రాంతి): భూమికోసం భుక్తి కోసం పీడిత ప్రజల విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించారని పోరాటంలో అమరులైన వారి త్యాగాలను వృధాకానీఇవ్వబోమని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అడుసుమిల్లి సాయిబాబా(CPI District Executive Committee Member Adusumilli Saibaba) అన్నారు.
తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలను పురస్కరించుకొని సిపిఐ ఆధ్వర్యంలో గురువారం స్థానిక చండ్ర రాజేశ్వరరావు భవన్ వద్ద తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలిత అమరవీరులకు పూలమాలలతో నివాళులర్పించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ రజాకార్ల లాఠీ దెబ్బలకు తూటాలకు బెదరకుండా నిజాం రాజు కబంధహస్తాల నుండి స్వేచ్ఛ భారతదేశంలో తెలంగాణ విలీనం అయ్యో వరకు కమ్యూనిస్టులు చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకం అన్నారు.
బిజెపి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఏ సంబంధం లేకుండానే సాయుధ పోరాటంలో మా పాత్ర ఉందని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. దేశంలో కులం, మతం, ప్రాంతం పేరుతో రెచ్చగొట్టి దేశాన్ని నాశనం చేస్తున్నారన్నారు. సాయుధ పోరాటాన్ని కూడా హిందూ ముస్లీంల పోరాటంగా చిత్రీకరించి అమవానపరుస్తున్నారని, ఇలాంటి ప్రభుత్వాలకు ప్రజలు బుద్ది చెప్పాలన్నారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి అసలుసిసలైన వారసులు కమ్యూనిస్టులేని అన్నారు. బ్రిటిష్ రజాకార్లు పాలనకు మించి నేటి పాలకులు ప్రజలపై దమనకాండ కొనసాగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి దొరలు రజాకార్ల మూకలను తరిమికొట్టి ఈ తెలంగాణాకు విముక్తి కలిగించిన కమ్యూనిస్టు యోధుల స్ఫూర్తితో నేటి ప్రజా, కార్మిక వ్యతిరేక ప్రభుత్వ విధానాలపై ప్రజలను చైతన్యవంతం చేయవలసిన గురుతర బాధ్యత కమ్యూనిస్ట్ శ్రేణులపై ఉందన్నారు.