అంతర్జాతీయ అవార్డుకు డాక్టర్ విష్ణుదాసు గోపాల్‌రావు ఎంపిక
హుజురాబాద్,(విజయక్రాంతి): కళలు, సంస్కృతిని పరిరక్షిస్తూ సమాజానికి విశేష సేవలు అందిస్తున్న సాంస్కృతిక గురువులను సత్కరించేందుకు రోటరీ క్లబ్ హైదరాబాద్ మెగాసిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ టీచర్స్ ఫెలిసిటేషన్ కార్యక్రమానికి(International Teachers' Felicitation Program) కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌కు చెందిన సీనియర్ జానపద కళాకారుడు డాక్టర్ విష్ణుదాసు గోపాల్‌రావు ఎంపికయ్యారు. సాంస్కృతిక గురువుగా అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఆయనకు అంతర్జాతీయ అవార్డు(international award)ను ప్రదానం చేయనున్నారు.
సంకల్ప్ ఫౌండేషన్ సహకారంతో ఈ నెల 19న హైదరాబాద్ మాదాపూర్‌లోని సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ రీజినల్ సెంటర్లో ఈ అవార్డు ప్రదానోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గోపాల్‌రావు గత 52 సంవత్సరాలుగా కళారంగంలో విశేష సేవలు అందిస్తున్నారు. కళారవళి సోషియో కల్చరల్ అసోసియేషన్ ద్వారా 25 సంవత్సరాలకు పైగా అనేక మంది కళాకారులను గుర్తించి, వారికి అవకాశాలు కల్పిస్తూ సత్కరిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు ప్రదర్శనలు ఇచ్చి తెలంగాణ కళలకు గుర్తింపు తీసుకువచ్చారు.
ఆయన సేవలకు గుర్తింపుగా డాక్టరేట్‌తో పాటు అబ్దుల్ కలాం నేషనల్ అవార్డు, అచీవ్మెంట్ అవార్డు, గిన్నిస్ వరల్డ్ రికార్డులు సహా జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకున్నారు. ఢిల్లీ, అండమాన్ నికోబార్, కువైట్, లండన్, అమెరికా తదితర ప్రాంతాల్లో కళా ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రతి సంవత్సరం జిల్లా, రాష్ట్రస్థాయిలో వివిధ కార్యక్రమాల్లో యాంకర్‌గా, కళాకారుడిగా తనదైన గుర్తింపు పొందారు.