ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్
భూపాలపల్లి, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్నారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఐడీఓసీ ఆవరణలో వేడుకలు నిర్వహించారు. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్(BC Commission Chairman Niranjan) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిరంజన్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ప్రత్యేకమైన రోజన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తుర్రేబాజ్ ఖాన్, చాకలి ఐలమ్మ, రావి నారాయణరెడ్డి, కాళోజీ నారాయణరావు తదితరుల త్యాగాలు స్ఫూర్తిదాయకమన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జిల్లాలో 29,683 మంది రైతులకు రూ.299.35 కోట్ల రుణమాఫీ, 1,27,151 మందికి రైతుభరోసా కింద రూ.145 కోట్ల సాయం అందించామని తెలిపారు. 21,806 మంది రైతుల నుంచి 12.58 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసి రూ.298.21 కోట్లు చెల్లించినట్లు వివరించారు.
మహాలక్ష్మి పథకంతో మహిళలకు రూ.120.03 కోట్ల మేర ఆదా జరిగిందన్నారు. 68,373 మంది లబ్ధిదారులకు రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేసి రూ.6.55 కోట్ల సబ్సిడీ ఇచ్చినట్లు తెలిపారు. భూభారతి కింద 70 గ్రామాల్లో రీ-సర్వే కొనసాగుతోందని, 1,39,682 స్మార్ట్ రేషన్ కార్డులు, 17,301 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశామని చెప్పారు. మొదటి విడతలో మంజూరైన 4,586 ఇందిరమ్మ ఇళ్లలో 1,098 పూర్తయ్యాయని తెలిపారు. తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యంతో రాష్ట్ర అభివృద్ధికి ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.