ఎస్‌ఎక్స్‌ఆర్‌ జీటీ స్కూటర్లు విడుదల చేసిన ఏప్రిలియా

23-10-2026 | 10:41pm

హైదరాబాద్: ప్రీమియం(Aprilia) స్కూటర్‌ విభాగంలోకి కొత్త ఎస్‌ఎక్స్‌ఆర్‌ జీటీ శ్రేణిని ఏప్రిలియా తీసుకొచ్చింది. సోమాజిగూడలోని పార్క్‌ హోటల్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో పియాజియో వెహికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, టూ వీలర్‌ డొమెస్టిక్ బిజినెస్ హెడ్ అజయ్‌ రఘువంశీ సమక్షంలో వీటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పియాజియో వెహికల్స్‌ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డియెగో గ్రాఫీ మాట్లాడుతూ భారత స్కూటర్‌ మార్కెట్లో ప్రీమియం వాహనాలకు ఆదరణ పెరుగుతోందన్నారు.

పనితీరు, సౌకర్యం, సాంకేతికతతో పాటు ప్రత్యేకమైన డిజైన్‌ను వినియోగదారులు కోరుకుంటున్నారంటూ ఆధునిక జీవనశైలికి తగినట్లుగా నగర ప్రయాణాలతోపాటు దూర ప్రయాణాలకూ అనువుగా కొత్త ఎస్‌ఎక్స్‌ఆర్‌ జీటీ శ్రేణిని రూపొందించినట్లు తెలిపారు. ఎస్‌ఎక్స్‌ఆర్‌ జీటీ 125 , ఎస్‌ఎక్స్‌ఆర్‌ జీటీ 175 పేరిట రెండు మోడళ్లను సంస్థ అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణలో ఎస్‌ఎక్స్‌ఆర్‌ జీటీ 125 ధరలు రూ.1,10,374 కాగా ఎస్‌ఎక్స్‌ఆర్‌ జీటీ 175 ధర  రూ.1,30,374గా నిర్ణయించింది. 125 సీసీ మోడల్‌ 7.8 కిలోవాట్ల గరిష్ఠ శక్తి, 10.4 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

175 సీసీ మోడల్‌ 9.76 కిలోవాట్ల శక్తి, 14.14 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. రెండు మోడళ్లలోనూ ఎయిర్‌ కూల్డ్‌ ఇంజిన్‌, ఎలక్ట్రిక్‌ స్టార్టర్‌ ఉన్నాయి. బీఎస్‌-6 ఓబీడీ-2 స్టేజ్‌ బీ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన ఇంజిన్లు ఈ20 ఇంధనంతోనూ పనిచేస్తాయి. 175 సీసీ మోడల్‌లో 5 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లేతోపాటు బ్లూటూత్‌ కనెక్టివిటీ, కాల్‌, మ్యూజిక్‌ నిర్వహణ, టర్న్‌-బై-టర్న్‌ నావిగేషన్‌ సదుపాయాలు ఉన్నాయి. 125 సీసీ మోడల్‌లో 5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 

175 సీసీ వేరియంట్‌లో ముందు చక్రానికి ఏబీఎస్‌, 220 ఎంఎం డిస్క్‌ బ్రేక్‌ ఉండగా, 125 సీసీ వేరియంట్‌లో ముందు డిస్క్‌, వెనుక డ్రమ్‌ బ్రేకులు ఉన్నాయి. ఈ రెండు వేరియంట్లలో మొత్తంగా ఆరు రంగుల నుంచి ఎంపిక చేసుకునే అవకాశం అందిస్తున్నారు.  మ్యాటీ బ్లాక్‌, గ్లోసీ అజురో, గ్లోసీ వైట్‌ రంగుల్లో ఎస్‌ఎక్స్‌ఆర్‌ జీటీ 125 లభిస్తుంది. 175 సీసీ మోడల్‌ మెటాలిక్‌ బ్లూ, మ్యాటీ బ్లాక్‌, మ్యాటీ గ్రీన్‌ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. దేశవ్యాప్తంగా ఏప్రిలియా డీలర్‌షిప్‌లలో బుకింగ్స్‌ ప్రారంభించినట్లు సంస్థ వెల్లడించింది.

మరిన్ని వార్తలు