స్లీపర్ బస్సులో మృత్యుఘోష
గ్రేటర్ నోయిడా: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా పరిధిలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై(Yamuna Expressway) గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి మహోబా(Delhi to Mahoba) వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ స్లీపర్ టూరిస్ట్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో 9 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం తెల్లవారుజామున జరగడంతో బస్సులోని ఎక్కువ మంది ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో అప్రమత్తమయ్యేలోపే బస్సు అంతటా వ్యాపించినట్లు సమాచారం. దీంతో ప్రయాణికులు బయటకు రావడానికి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు
బస్సులో మంటలు చెలరేగిన విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. తీవ్రంగా మండుతున్న బస్సును అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు. అనంతరం బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసే ప్రయత్నం చేశారు. ప్రమాదంలో గాయపడిన పలువురిని పోలీసులు, రక్షణ సిబ్బంది సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల వివరాలను గుర్తించే ప్రక్రియను అధికారులు చేపట్టారు. బస్సులో మంటలు ఎలా చెలరేగాయి? ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణమా, లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.