థియేటర్ సందర్శన రద్దు.. హీరో నానిపై ప్రశంసలు
నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) కథానాయకుడిగా, శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వం లో రూపుదిద్దుకున్న భారీ యాక్షన్ చిత్రం ‘ది ప్యారడైజ్(The Paradise)’. ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న నేపథ్యంలో, సెప్టెంబర్ 23 రాత్రి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక ప్రీమియర్ షోలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ థియేటర్లో అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వాలంటూ హీరో నాని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎక్స్ వేదికగా ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.
దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందిస్తూనే కొన్ని కీలక సూచనలు చేశారు. ఇదిలావుండగా, పౌ రుల భద్రతా ఇబ్బందుల నేపథ్యంలో నాని థియేటర్ సందర్శనకు పోలీసు శాఖ నుంచి అనుమతి లభించలేదు. అయితే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డీజీపీ సూచనల అనంతరం హీరో నాని బాధ్యతా యుతమైన నిర్ణయం తీసుకున్నారు. గణేశ్ నిమజ్జనం బందోబస్తులో ఉన్న పోలీస్ యంత్రాంగానికి అదనపు భారం కాకూడదనే ఉద్దేశంతో, అలాగే అభిమానుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తన థియేటర్ సందర్శనను రద్దు చేసుకుంటున్నట్టు నాని ప్రకటించారు.
అంతకుముందు హీరో నాని ఎక్స్ వేదికగా ఇలా పోస్ట్ చేశారు.. “చిన్నప్పటి నుంచి ప్రేక్షకులతో కలిసి థియేటర్లలో సినిమాలు చూడటం నాకు ఎంతో ఇష్టం. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సినిమా చూడటమనేది ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. అందుకే అభిమానుల మధ్య కూర్చొని వారి స్పందనను ప్రత్యక్షంగా చూడాలని ఉంది” అంటూ సీఎం రేవంత్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలను ట్యాగ్ చేస్తూ అభ్యర్థించారు నాని. ‘థియేటర్ సందర్శన సమయంలో అమల్లో ఉన్న అన్ని ప్రభుత్వ నిబంధనలు, భద్రతా మార్గదర్శకాలను మేము ఖచ్చితంగా పాటిస్తాం.
ప్రజల భద్రతకే మా తొలి ప్రాధాన్యత’ అని కూడా నాని తన ట్వీట్లో స్పష్టం చేశారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. “భద్రతా మార్గదర్శకాల పట్ల నానికి ఉన్న బాధ్యతను, గౌరవం అభినందనీయం. అలాగే తెలంగాణ యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ‘ది ప్యారడైజ్’ సినిమా పట్ల నాని చూపిస్తున్న నిబద్ధతను ప్రశంసనీయం. జనసమూహ నియంత్రణ, ప్రజా భద్రత అనేవి అత్యంత ప్రాముఖ్యమైన అంశాలు. కాబట్టి నిబంధనల ప్రకారం స్థానిక పోలీస్ స్టేషన్లో అధికారికంగా దరఖాస్తు చేసుకోండి.
ఆ దరఖాస్తును పరిశీలించి ప్రజా భద్రతకు భంగం కలగకుండా పోలీసులు తుది నిర్ణయం తీసుకుంటారు” అని సీఎం బదులిచ్చారు. 2024లో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట, ప్రస్తుతం గణేశ్ నిమజ్జన ఉత్సవాల ఏర్పాట్ల దృష్ట్యా ప్రభుత్వం సెలబ్రిటీల థియేటర్ విజిట్స్‌పై అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. తాజాగా ప్రభుత్వ నిబంధనలను గౌరవిస్తూ నాని తీసుకున్న ఈ నిర్ణయాన్ని అటు రాజకీయ వర్గాలు, ఇటు సినీ అభిమానులు సైతం అభినందిస్తున్నారు.
టికెట్ ధరల పెంపు ఉత్తర్వుల పునఃసమీక్షకు హైకోర్టు ఆదేశం
‘ది ప్యారడైజ్’ సినిమా టికెట్ ధరల పెంపునకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ మెమోను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ సినిమా టికెట్ ధరల పెంపుపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, ప్రభుత్వం జారీ చేసిన పెంపు మెమోను వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమాకు ప్రత్యేక ప్రీమియర్ షోలతోపాటు టికెట్ రేట్లు పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 23 సాయంత్రం ప్రీమియర్ షోకు రూ.500, సెప్టెంబర్ 24 నుంచి సింగిల్ స్క్రీన్లలో రూ.225, మల్టీప్లెక్సుల్లో రూ.390 వరకు ధరలు నిర్ణయించారు. కోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో ఈ టికెట్ ధరల పెంపు నిర్ణయంపై మార్పులు వచ్చే అవకాశం ఉంది.
హైకోర్టు నిలదీత..
సినిమా విడుదలైన ప్రతిసారీ చివరి నిమిషంలో టికెట్ ధరలు పెంచడం, కోర్టులో దీనిపై విచారణ జరిగేలోపే టికెట్లు అమ్ముడుపోవడం వంటి వ్యూహాలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం టికెట్ ధరలు పెంచే ముందు 90 రోజుల ముందే ఆ ప్రతిపాదనను పబ్లిక్ డొమైన్లో ఉంచి ప్రజల అభ్యంతరాలు స్వీకరించాలని కోర్టు గుర్తుచేసింది. ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక మెమోను వెనక్కి తీసుకోవాలని, దీనిపై హోంశాఖ ముఖ్య కార్యదర్శి పునఃసమీక్ష జరపాలని జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 6వ తేదీకి వాయిదా వేశారు.