పాతరాతియుగం పనిముట్లు
- రంగారెడ్డి జిల్లా కొంగర ఖుర్దు ‘బి’ అటవీ ప్రాంతంలో లభ్యం
- గుర్తించిన చరిత్రకారులు
- హైదరాబాద్ నగర 3 లక్షల ఏండ్ల ప్రాచీనతకు సాక్ష్యం
- 3 లక్షల సంవత్సరాల నుంచి గొప్ప మానవావాసంగా ఉన్నదనడానికి బలమైన సాక్ష్యాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): మరోసారి హైదరాబాద్ పరిసరాల్లో పాతరాతియుగం రాతి పనిముట్లు(Paleolithic stone tools) కనుగొనబడ్డాయి. ఇవి ఈ ప్రాంతంలోని ప్రాచీన మానవావాసానికి(Ancient human settlement) బలమైన సాక్ష్యాలు అందిస్తున్నాయి. క్లైమేట్ ఫ్రంట్ తెలంగాణా వైస్ ప్రసిడెంట్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు, మారేడు ఎన్విరాన్మెంటల్ సర్వీసెస్ సహ -వ్యవస్థాపకుడు మీర్ ఒమర్ అలీ ఖాన్(Omar Ali Khan), అలాగే వన్యప్రాణి సంరక్షకుడు, హైటికోస్ సభ్యుడు శ్రీపతి వైష్ణవ్‌తో కలిసి జరిపిన సంయుక్త క్షేత్ర అన్వేషణలో పాతరాతియుగం క్వార్ట్జ్ రాతి చేతిగొడ్డలిని గుర్తించారు.
వారితో కలిసి సాయి వరుణ్ (బీట్ అధికారి), పవన్ (సెక్షన్ అధికారి) కూడా క్షేత్రంలో ఉన్నారు. ఈ అన్వేషణకు రంగారెడ్డి జిల్లా డీఎఫ్‌ఓ శివ్ ఆశీష్ సింగ్ ఐఎఫ్‌ఎస్, రేంజ్ అధికారి జె. ప్రభాకర్ మద్దతు ఇచ్చి బృందానికి సహాయం చేశారు. ఈ పనిముట్టు దక్షిణ హైద్రాబాద్ ప్రాంతంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొంగరకలాన్‌కు ఆనుకుని ఉన్న కొంగర ఖుర్దు ‘బి’ అటవీ ప్రాంతంలో 17ఓ11’01.1‘ ఉత్తర అక్షాంశం, 78ఓ30’44.4‘ తూర్పు రేఖాంశం వద్ద లభించింది. ఇది ఈ బృందం చేసిన మొదటి ఆవిష్కరణ కాదు.
గతంలో మీర్ ఒమర్ అలీ ఖాన్ స్వయంగా మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్కులోని మంచిరేవుల బీరప్పగుట్ట వద్ద క్వారట్జ్ రాతితో తయారు చేసిన పాతరాతియుగం చేతిగొడ్డళ్లు, పాయింట్లను కనుగొన్నారు. ప్రస్తుత అన్వేషణలో చేతిగొడ్డలితో పాటు అదే క్వార్ట్‌తో చేసిన గుండ్రని వడిసెల రాయిని కూడా సేకరించారు. ఈ ఆవిష్కరణ పాతరాతియుగంలో కూడా వడిసెల రాళ్లు ఉండేవని సూచిస్తోంది.
ఈ ఆవిష్కరణపై వ్యాఖ్యానిస్తూ కొత్త తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షుడు శ్రీరామోజు హరగోపాల్ ఇలా అన్నారు.. ఈ పనిముట్లు మంచిరేవుల - కొంగర ఖుర్దు ప్రాంతం ఒకప్పుడు ప్రాచీన మానవుల ఆవాసంగా ఉండేదని, కనీసం 3 లక్షల (3,00,000) సంవత్సరాల నుంచి గొప్ప మానవావాసంగా ఉన్నదని చెప్పడానికి బలమైన సాక్ష్యాలు. ఈ ప్రాంతాలను పురావస్తు శాస్త్రవేత్తలు మరింత విస్తృతంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అధికారులు అన్నారు.