బేకరీలలో తింటే రోగాలే!
- గడువు ముగిసిన రసాయనాల వాడకం
- ప్రాణాలతో చెలగాటం
- ఎస్‌ఓటీ తనిఖీలలో బహిర్గతం
ఘట్‌కేసర్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి) : ఘట్కేసర్ సర్కిల్(Ghatkesar Circle) పరిధిలోని పలు బేకరీల(Bakeries)పై ఉప్పల్ జోన్ స్పెషల్ ఆపరేషన్ టీమ్(Uppal Zone Special Operations Team) (ఎస్‌ఓటీ) పోలీసులు జరిపిన దాడులలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. బేకరీల నిర్వహకులు లాభాపేక్షతో గడువు ముగిసిన రసాయనాలు ఇతర పదార్థాలతో కేకులు తయారు(Cake making) చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు వెళ్లడైంది. ఇటీవల ఘట్కేసర్ లో రెండు బేకరీలలో ఎస్ ఓటి పోలీసులు తనిఖీ చేశారు.
ఈ రెండింటిలోనూ కల్తీ పదార్థాల(Adulterated substances)తో కేకులు, ఇతర తినుబండారాలు తయారు చేస్తున్నట్లు తేలింది. గడువు ముగిసిన పదార్థాలు కేకులు, పిజ్జాలు, బిస్కెట్ల తయారీలో గడువు ముగిసిన మైదా, రసాయనాలు, నాణ్యత లేని వంట నూనెలను ఉపయోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మండలంలోని ఒక గ్రామంలో తినుబండారాల తయారీ యూనిట్ లో తనిఖీలు చేయగా అందులో కూడా గడువు ముగిసిన పదార్థాలు వాడి తినుబండారాలు తయారు చేస్తున్నట్లు తేలింది. దీంతో ప్రజలు బయట పదార్థాలు తినడానికే భయపడే పరిస్థితి ఏర్పడింది.
కల్తీ రంగులు, రసాయనాలు
పదార్థాలు ఆకర్షణీయంగా కనిపించేందుకు నిబంధనలకు విరుద్ధంగా హానికర రసాయనాలు(Harmful chemicals), పరిమితికి మించిన ఫుడ్ కలర్స్ను కలుపుతున్నట్లు తేలింది. ఈగలు, దోమలు సంచరించేలా ఈగల మురికి కూపాలుగా మారిన వంటశాలల్లోనే ఈ పదార్థాలను తయారు చేస్తుండటం అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఫుడ్ సేఫ్టీ అధికారుల నిద్రమత్తు
హోటళ్లు, బేకరీలలో స్వచ్ఛత పాటించకపోవడం ఒక ఎత్తయితే, వాటిని నిరంతరం తనిఖీ చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం మరొక ఎత్తు. నామమాత్రపు తనిఖీలతో అధికారులు కేవలం సోషల్ మీడియాలో హడావుడి చేయడానికి లేదా వార్తల్లో నిలిచేందుకు కొన్ని ప్రముఖ హోటళ్లపై మాత్రమే దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎస్‌ఓటీ అధికారుల హెచ్చరిక
ఉప్పల్ జోన్ ఎస్‌ఓటి అధికారులు ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో నాసిరకం, గడువు ముగిసిన నిల్వలను సీజ్ చేసి, నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల అనంతరం నిబంధనలు ఉల్లంఘించే బేకరీలు, హోటళ్లపై చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని, అవసరమైతే సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే కల్తీ రాయుళ్లపై ఎస్‌ఓటీ పోలీసులు తీసుకున్న ఈ త్వరిత చర్య పట్ల ఘట్కేసర్ సర్కిల్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.