లక్డీకాపుల్‌లో హైటెన్షన్

24-09-2026 | 11:53am

హైదరాబాద్: లక్డీకాపుల్‌లోని సింగరేణి ప్రధాన కార్యాలయం(Singareni Headquarters) వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సింగరేణిలో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలు, అవకతవకలపై వాస్తవాలను తెలుసుకునేందుకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్(Koppula Ishwar), ఎమ్మెల్యే కేపీ వివేకానందతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు సింగరేణి హెడ్ ఆఫీస్‌ను సందర్శించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. బీఆర్ఎస్ నాయకులు సింగరేణి కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకునే చర్యల్లో భాగంగా హెడ్ ఆఫీస్ పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. కార్యాలయం వద్దకు వచ్చే వాహనాలు, నాయకులు, కార్యకర్తలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తును కట్టుదిట్టం చేశారు.

సింగరేణి సంస్థలో(Singareni company) జరుగుతున్న పరిణామాలపై పూర్తి వివరాలు తెలుసుకోవడంతో పాటు, ఉద్యోగులు, సంస్థకు సంబంధించిన అంశాలను పరిశీలించేందుకు తాము హెడ్ ఆఫీస్‌ను సందర్శించనున్నట్లు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అయితే వారి పర్యటనకు అనుమతి ఉందా లేదా అనే అంశంపై స్పష్టత కోసం పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించారు. దీంతో లక్డీకాపుల్ పరిసరాల్లో రాజకీయంగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ప్రస్తుతం భారీ పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు