ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో టోకరా
- హయత్ నగర్‌లో ఘరానా మోసం
- పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న బాధితులు
- తెలంగాణ వ్యాప్తంగా డబ్బులు వసూలు
- 800 మంది బాధితులు.. 5 కోట్ల మోసం
ఎల్బీనగర్, సెప్టెంబర్ 21: ఆన్‌లైన్ ట్రేడింగ్(Online Trading) పేరుతో జనానికి టోకరా వేసిన ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్(Hayathnagar Police Station) పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఒక్క హయత్ నగర్ డివిజన్‌లోనే సుమారు 34 మంది బాధితులు ఉన్నారు. వారం రోజుల క్రితం ఇబ్రహీపట్నంలో ఘరానా మోసం మరవకముందే హయత్ నగర్‌లో మరో ఘటన చోటు చేసుకుంది. హయత్ నగర్ డివిజన్ సీఎస్‌ఆర్ కాలనీకి చెందిన వెంకటేశ్వర అప్పా, మండల రాములు క్యూవీఎస్‌ఈ యాప్(QVSE App) ద్వారా భారీ లాభాలు ఇస్తామని ప్రచారం చేశారు. మొదటగా రూ.50 వేలు కట్టి, యాప్‌లో చేరాలని, ఇందుకు ప్రతి రోజూ ఆరు డాలర్లు ఇస్తామని ప్రచారం చేశారు.
ఇందుకు ఆశపడిన మహిళలు, చిరు వ్యాపారులు యాప్‌లో చేరారు. కొందరు సుమారు రూ.15 లక్షల వరకు చెల్లించారు. ఇక్కడ జరిగిన లావాదేవీలు కేవలం నగదు రూపంలోనే జరిగాయి. దీంతో సుమారు 800 మంది బాధితులు డబ్బులు కట్టి మోసపోయారు. రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు మోసం జరిగిందని ప్రాథమిక అంచనా. కాగా, మోసపోయిన వారు వారి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సీఐ శంకరయ్య చెప్పారని బాధితులు వాపోతున్నారు.
మోసం చేసిన వారు హయత్ నగర్‌లో ఉంటే కేసు ఇక్కడ కాదు మీ ఏరియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వాలని వెనక్కి పంపించారని బాధితులు పేర్కొంటున్నారు. అయితే, ఎల్బీనగర్, నాగోల్, మీర్ పేట, చంపాపేట, షాద్ నగర్, కరీంనగర్ ప్రాంతాలకు చెందిన బాధితులు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలివచ్చారు.
మరో యాప్ పేరుతో ముందుకు
క్యూవీఎస్‌ఈ యాప్‌తో మోసం చేసింది కాగా, అపోలో అనే పేరుతో యాప్ సృష్టించి, మళ్లీ మోసానికి తెర తీశారని బాధితులు ఆరోపించారు. పాత యాప్‌లో ఉన్న నగదు తీసుకోవాలంటే మళ్లీ రూ.50 వేలు కట్టి అపోలో యాప్ చేరాలని ఏజెంట్లు చెపుతున్నారని వాపోయారు.