పై అంతస్తులో గొడవ.. రోడ్డుపై వ్యక్తి బలి
ఆకాశం నుంచి పడిన మృత్యువు.. తలపై సిలిండర్ పడి యువకుడు మృతి
న్యూఢిల్లీ: ఇద్దరి మధ్య జరిగిన గొడవ ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. మూడో అంతస్తు నుంచి కిందపడిన LPG Gas Cylinder తలపై బలంగా తగలడంతో 30 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. దేశ రాజధాని ఢిల్లీలోని నైరుతి ప్రాంతం బిందాపూర్లో శుక్రవారం సాయంత్రం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. తలాబ్ వాలా పార్క్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం సుమారు 6:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. భవనం బయట సాహిల్ (30) అనే వ్యక్తి నిలబడి ఉన్నాడు. అదే సమయంలో భవనంలోని మూడో అంతస్తులో ఓ వ్యక్తికి, అతడి తల్లికి మధ్య గొడవ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో మూడో అంతస్తు Balcony నుంచి నిండుగా ఉన్న LPG Cylinder కిందకు విసిరినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అది నేరుగా కింద ఉన్న సాహిల్ తలపై పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ అనూహ్య ఘటనతో అక్కడ కలకలం రేగింది. తీవ్ర గాయాలపాలైన సాహిల్ చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఒక కుటుంబంలో జరిగిన గొడవ.. కింద ఉన్న వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, బాధ్యులపై తదుపరి చర్యలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.