దేశానికి యువతే అతిపెద్ద ఆస్తి
- ఆ యువశక్తిని వినియోగించుకోవాలి
- 2029 నాటికి డ్రగ్ ఫ్రీ భారత్ లక్ష్యం
- ఉద్యమానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు
- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
- మద్యం, డ్రగ్స్ వైపు చూడొద్దు : మెగాస్టార్ చిరంజీవి
- మోదీ సంకల్పం నెరవేరాలి: హీరో నాగార్జున
హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): దేశ భవిష్యత్తుకు యువతే అతిపెద్ద ఆస్తి అని, వారిని మత్తుపదార్థాల బారి నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) పేర్కొన్నారు. 2029 నాటికి దేశాన్ని డ్రగ్స్ రహిత భారత్‌గా తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్రమోదీ సంకల్పానికి ప్రజలందరూ తోడుగా నిలవాలని కోరారు. డ్రగ్స్ సమస్య దేశ భవిష్యత్తు, కోట్లాది మంది యువత జీవితాలకు చెందినదని తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ మహాపాదయాత్ర శుక్రవారంతో ముగిసింది.
అంబర్‌పేట్‌లో ఈ నెల 25న, బుధవారం మొదలైన ఈ యాత్ర ముషీరాబాద్, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్ వరకు సుమారు 40 కి.మీ.ల మేర మూడు రోజుల పాటు కొనసాగింది. చివరి రోజు అమీర్‌పేట్‌లో గురుద్వారలో ప్రార్థనల అనంతరం సత్యం థియేటర్ నుంచి మొదలైన కిషన్‌రెడ్డి పాదయాత్ర జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ వరకు సాగింది. అక్కడే సభ నిర్వహించి పాదయాత్రను ముగించారు. సత్యం థియేటర్ వద్ద సినీనటులు చిరంజీవి, నాగార్జున, సాయికుమార్, డైరెక్టర్లు బోయపాటి, సుకుమార్ ఇతర ప్రముఖులు భాగస్వాములయ్యారు. కిషన్‌రెడ్డి పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు.
ప్రపంచానికే బలం భారతీయ యువత
జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన ముగింపు సభలో కిషన్ రెడ్డి ప్రసంగించారు. భారత్‌లో సుమారు 70 కోట్ల మంది యువత ఉన్నారని, దేశ అభివృద్ధిలో వారిదే కీలక పాత్ర అని పేర్కొన్నారు. ఐటీ, వైద్య, సర్వీస్ రంగాలతోపాటు సాంకేతిక ఆవిష్కరణల్లో మన యువత ప్రపంచవ్యాప్తంగా ప్రతిభ చాటుతోందన్నారు. ఇంతటి యువశక్తిని మత్తుపదార్థాలకు దూరంగా ఉంచి దేశాభివృద్ధికి వినియోగించుకోవాలన్నారు. తన మూడు రోజుల యాత్రలో వీసీలు, డాక్టర్లు, విద్యార్థులు, యువత, మహిళలు, పలువురు ప్రముఖులు కలిసొచ్చారని, వారిని చూస్తే నషా ముక్త్ భారత్ లక్ష్యం నెరవేరుతుందనే నమ్మకం వచ్చిందన్నారు.
యువతతోనే వికసిత్ భారత్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
భారత్‌ను ప్రపంచంలోనే శక్తిశాలి దేశంగా నిలబెట్టాలన్న గొప్ప సంకల్పంతో ప్రధాని మోదీ నషాముక్త్ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. వికసిత్ భారత్ నిర్మాణంలో నేటి యువత భాగస్వాములు కావాలన్నఆశయంతో కిషన్ రెడ్డి చేపట్టిన యాత్ర స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. యువతతోనే వికసిత్ భారత్ కల సాకారం అవుతుందన్నారు. మూడు రోజులుగా నషా ముక్త్ భారత్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లిన కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాలకతీతంగా ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
ఉగ్రవాదంపై మాదిరిగానే డ్రగ్స్‌పై పోరు: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
ఉగ్రవాదం, నక్సలిజంపై పోరాటం చేసినట్టుగా డ్రగ్స్ నిర్మూలనపై కూడా దేశమంతా ఐక్యంగా పోరాడాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. నార్కో టెర్రరిజం రూపంలో దేశ యువతను నిర్వీర్యం చేసే కుట్రలను తిప్పికొట్టాలని పేర్కొన్నారు.
ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ హైదరాబాద్‌ను డ్రగ్స్‌కు దూరంగా ఉంచాలనే కిషన్‌రెడ్డి లక్ష్యాన్ని ప్రశంసించారు. ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ భారత్‌ను బలమైన దేశంగా నిలబెట్టాలంటే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. సినీ దర్శకులు సుకుమార్, బోయపాటి శ్రీను మాట్లాడుతూ డ్రగ్స్ రహిత దేశం కోసం యువత పెద్దఎత్తున కదలిరావడం ఆనందంగా ఉందన్నారు. భావితరాలకు విజ్ఞానం, ఆరోగ్యకరమైన జీవితం అందించాలంటే మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
పాదయాత్రతో ప్రజల్లో చర్చ : మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మూడు రోజుల తన పాదయాత్రతో నషా ముక్త్ భారత్ నినాదాన్ని రగిలించారని మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు అన్నారు. డగ్స్ నిర్మూలనపై ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించారని పేర్కొన్నారు. గ్రామాల్లోని ప్రజలు కూడా మత్తు పదార్థాల నుంచి తమను తాము రక్షించుకుంటామని చెబుతున్నారని తెలిపారు. నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో మహిళల పాత్ర ఉండాలన్నారు.
మద్యం, డ్రగ్స్ వైపు చూడొద్దు : మెగాస్టార్ చిరంజీవి
లక్ష్యాన్ని చేరేందుకు తాను చెడు వ్యసనాలకు దూరంగా ఉన్నానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. యువత, చిన్నారులు డ్రగ్స్ బారిన పడకుండా చూడాలని తల్లిద్రండులను, ప్రభుత్వాలను కోరారు. మద్యపానం వంటి వ్యసనాలు మనకు తెలియకుండానే అలవాటు- అవుతాయని, దురలవాట్లను నిర్మోహమాటంగా మొదటిసారే వ్యతిరేకించాలని సూచించారు. ‘నేను స్నేహితుడితో కలిసి చెన్నై పాండిబజార్‌కు టీ తాగేందుకు వెళ్లా. ఒక బీర్ ఇవ్వండి మనోడికి భయమంతా పోతుంది అన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ మామూలే. తాగాలని ఒత్తిడి చేస్తారు. వద్దని అక్కడి నుంచి వెళ్లిపోయాను. మళ్లీ ఆ ప్రాంతానికి వెళ్లకూడదని నిశ్చయించుకున్నా. అలా అన్ని దాటుకుని నా లక్ష్యం వైపు వెళ్లా. కాబట్టే ఇప్పుడు మెగాస్టార్‌గా మీ ముందుకు నిలబడ్డాను’ అని చిరంజీవి పేర్కొన్నారు.
మోదీ సంకల్పం నెరవేరాలి: హీరో నాగార్జున
దేశం నుంచి డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పం విజయవంతం కావాలని ప్రముఖ సినీనటు-డు అక్కినేని నాగార్జున ఆకాంక్షించారు. డ్రగ్స్ రహిత దేశ నిర్మాణం కోసం కిషన్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ ఉద్యమంలో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. సినీ నటు-డు, మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ అలవాటు-పడితే వ్యక్తిగ త జీవితంతోపాటు- సామాజిక గౌరవం కూడా దెబ్బతింటు-ందని హెచ్చరించారు. తనదైన శైలిలో ప్రసంగిస్తూ ’డ్రగ్స్ తీసు కుంటే దబిడిదిబిడే’ అంటూ యువతను ఉత్సాహపరిచారు.
43 వేల మంది విద్యార్థుల భాగస్వామ్యం
మూడు రోజుల పాదయాత్రలో విద్యార్థుల భాగస్వామ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 220 పాఠశాలలు, 52 జూనియర్ కళాశాలలు, 30ఇంజినీరింగ్ కాలేజీల నుంచి సుమారు 43 వేల మంది విద్యార్థులు ఈ యాత్రలో కదంతొక్కారు. ముగింపు కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండర్ పండిట్ రవిశంకర్ పాల్గొన్నారు.