ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వ్యక్తి మృతి

25-09-2026 | 07:18pm

కేసు నమోదు చేసిన తాడ్వాయి పోలీసులు 

ములుగు, సెప్టెంబర్ 25 (విజయకాంత్) : ములుగు జిల్లా(Mulugu District) తాడ్వాయి పోలీస్ స్టేషన్(Tadwai Police Station) పరిధిలోని తాడ్వాయి–పస్రా ప్రధాన రహదారిపై, కొండపర్తి సమీపంలో రోడ్డు ప్రమాదం(Road accident) జరగగా ప్రమాదంలో ఒకరి మృతిచెందగా పలువురికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం పెద్దతండాకు చెందిన దరావత్ భద్రు తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి, ఇటీవల మృతి చెందిన తన పెద్దనాన్న దరావత్ భద్రు అస్తికలను భద్రాచలంలోని గోదావరి నదిలో కలిపేందుకు బొలెరో వాహనంలో భద్రాచలం వెళ్లి, కార్యక్రమాలు ముగించుకొని తిరిగి వస్తున్నారు.

ఈ క్రమంలో శుక్రవారం ఉదయం భద్రాచలం నుండి బయలుదేరి తాడ్వాయి వైపు వస్తుండగా, కొండపర్తి సమీపంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ డేగ కిషోర్ అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా రాంగ్ రూట్‌లో నడుపుతూ వచ్చి బొలెరో వాహనాన్ని ఢీకొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న దరావత్ భద్రుకు తలకు తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే సమయంలో మృతి చెందినట్లు సమాచారం.

అలాగే దరావత్ సరోజ, దరావత్ నేహా, దరావత్ సక్రూ, దరావత్ బుజ్జమ్మ, బుక్యా జ్యోతి, దరావత్ వెంకన్న, దరావత్ అనిత తదితరులకు గాయాలైనట్లు తెలిసింది. సమాచారం అందుకున్న వెంటనే తాడ్వాయి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, గాయపడిన వారికి వైద్య చికిత్స అందించబడింది. ఈ ఘటనపై మృతుడి బంధువు దరావత్ నగేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు