ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

27-11-2026 | 10:13am

వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని.. ప్రియుడితో కలిసి భార్య దారుణం!

వెంకటాపురం-నూగూరు,(విజయక్రాంతి): వివాహేతర సంబంధం ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్య తన ప్రియుడితో కలిసి అతడిని హత్య చేసినట్లు ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ములుగు జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వెంకటాపురం మండల కేంద్రంలోని బీసీ మర్రిగూడెం పంచాయతీ పరిధిలో ఉన్న డబుల్ బెడ్రూం కాలనీలో ఈ దారుణం జరిగినట్లు సమాచారం. కాలనీకి చెందిన పూనెం నాగరాజు (32) తన భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. వృత్తిరీత్యా Motor Vehicle Driver‌గా పనిచేస్తున్న నాగరాజు కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు.

అయితే జ్యోతి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై నాగరాజు పలుమార్లు భార్యను హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే ఉద్దేశంతో జ్యోతి, తన ప్రియుడు గుండారపు సత్యంతో కలిసి హత్యకు పథకం రచించినట్లు ప్రాథమిక సమాచారం. బుధవారం రాత్రి ఇంట్లోనే నాగరాజును హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం ఈ ఘటన వెలుగులోకి రావడంతో డబుల్ బెడ్రూం కాలనీలో ఒక్కసారిగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏటూరునాగారం ఏఎస్పీ, వెంకటాపురం సీఐ శ్రీధర్, ఎస్‌ఐ తిరుపతిరావు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. నిపుణుల బృందంతో కలిసి హత్య జరిగిన ఇంట్లో ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఈ ఘటనపై వెంకటాపురం పోలీసులు Case నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే హత్యకు గల పూర్తి కారణాలు, ఘటనలో ఎవరి పాత్ర ఎంత అనే అంశాలపై పోలీసుల అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.

మరిన్ని వార్తలు