73 మంది ప్రాణాలు కాపాడిన ప్రయాణికుడు

27-11-2026 | 07:50am

క్షణాల్లో పెను ప్రమాదం.. హీరోలా మారిన ప్యాసింజర్!

హనుమకొండ: డ్రైవర్‌కు హఠాత్తుగా ఫిట్స్.. అదుపుతప్పిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు.. క్షణాల్లో 73 మంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. అయితే ఓ ప్రయాణికుడు చూపిన Extraordinary Courage, సమయస్ఫూర్తి పెను ప్రమాదాన్ని తప్పించింది. డ్రైవర్ స్టీరింగ్‌పై నియంత్రణ కోల్పోయిన సమయంలో కండక్టర్‌తో కలిసి బస్సును అదుపులోకి తీసుకుని నిలిపివేశాడు. ఈ ఘటన హనుమకొండ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న బస్సులో కాజీపేట సమీపంలో గురువారం చోటుచేసుకుంది.

హనుమకొండ నుంచి గురువారం మధ్యాహ్నం 2:25 గంటలకు 73 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సు కాజీపేట బాపూజీనగర్ చౌరస్తా వద్దకు చేరుకుంది. అదే సమయంలో డ్రైవర్ రాజుకు హఠాత్తుగా ఫిట్స్ రావడంతో ఆయన స్టీరింగ్‌పై పట్టు కోల్పోయారు. దీంతో బస్సు అదుపుతప్పి ముందుకు దూసుకెళ్లింది. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. బస్సులో కేకలు, గందరగోళం నెలకొన్నాయి.

పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో కండక్టర్ విజయ్ వెంటనే స్పందించి బ్రేకులు వేసేందుకు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోవడంతో బస్సులో ఉన్న జనగామకు చెందిన ప్రయాణికుడు రామకోటి రంగంలోకి దిగారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా డ్రైవర్‌ను పక్కకు జరిపి, కండక్టర్ సహాయంతో స్టీరింగ్‌ను తన చేతుల్లోకి తీసుకున్నారు. అనంతరం బ్రేకులు వేసి బస్సును నిలిపివేశారు. ఈ Timely Actionతో బస్సులో ఉన్న 73 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే బస్సు అదుపుతప్పిన సమయంలో రోడ్డు పక్కన ఉన్న ఆగమ్మ అనే వృద్ధురాలితో పాటు మరో మహిళను ఢీకొట్టడంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి.

అదే మార్గంలో వెళ్తున్న కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి ఘటనను గమనించి వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వృద్ధురాలితో పాటు అస్వస్థతకు గురైన డ్రైవర్‌ను తన వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ధైర్యంగా వ్యవహరించి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన రామకోటి, కండక్టర్ విజయ్‌ను ఏసీపీ శాలువాతో సత్కరించారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా రామకోటికి ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందించారు. ఒక ప్రయాణికుడి సమయస్ఫూర్తి, కండక్టర్ చొరవ కలిపి 73 మందికి ప్రాణరక్షణగా నిలిచాయి.

మరిన్ని వార్తలు