బీసీలు 56 శాతం.. మరి రాజకీయ ప్రాతినిధ్యం?

22-09-2026 | 05:05am

టీ. చిరంజీవులు :

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎన్నో ఆశలు, ఆకాంక్షల్లో నుంచి ఏర్పడింది. విద్య, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు(Education, jobs, and employment opportunities) మెరుగుపడతాయని విద్యార్థులు, యువత తమ ప్రాణాలను పణంగా ఉద్యమంలో కదం తొక్కారు. సామాజిక న్యాయం, రాజకీయాల్లో తమ ప్రాతినిథ్యం దక్కుతుందనుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించింది. ప్రజలు కన్న కలలు సాకారం.. కలలుగానే మిగిలిపోతోంది. ముఖ్యంగా బహుజనులు రాజ్యాధికారం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులే నెలకొన్నాయి. మెజారిటీ జనాభా కలిగిన వర్గం పాలకులుగా ఉండాల్సిన సమాజంలో మైనారిటీ వర్గం రాజ్యాధికారాన్ని గుప్పిట్లో పెట్టుకోవడం మరో ఉద్యమానికి దారితీయొచ్చు.

తెలంగాణ(Telangana) పోరాటాల గడ్డ(land of struggles). నిత్య ఉద్యమ చైతన్య దీపిక. అన్యాయానికి, దోపిడీకి, భూస్వామ్య ఆధిపత్యానికి, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలకు పురుడు పోసిన నేల. ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేక స్థానం సంపాదించుకున్న తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం(Telangana Armed Peasant Struggle) ద్వారా భూస్వా మ్య- నిజాం పాలన(Nizam Rule)కు వ్యతిరేకంగా సామా న్య ప్రజలు ఆయుధాలు చేపట్టి పోరాడిన విప్లవ గడ్డ. ఆ పోరాటంలో సుమారు 4వే ల మంది అమరులైనా ఉద్యమాలు ఆగని గడ్డ.

తదనంతరం కూడా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో భూస్వామ్య వ్యతిరేక రైతాంగ పోరాటాలు, సిరిసిల్ల(Sircilla).. జగిత్యాల ప్రాంతాల ఉద్యమాలు, నక్సలైట్, మావోయిస్ట్ ఉద్యమాలు(Maoist movements) జరిగాయి. వీటిలో కూడా వేలాదిమంది అమరులయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనానికి వ్యతిరేకంగా జరిగిన తొలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్య మం (1969)నుంచి, మలిదశ ఉద్యమం (2001--2014)లో సుమారు 2 వేలమంది అమరులయ్యారు. బహుజన ప్రజ లు అనేక త్యాగాలు చేశారు. ఎన్ని త్యాగాలు చేసినా అంతిమ ఫలితం రాజ్యాధికారం ఆధిపత్య కులాల చేతిలోనే ఉండిపోయింది. బహుజనుల త్యాగాలకు తగిన ఫలితాలు రాని పరిస్థితి. కేవలం ఓటు బ్యాంకు యంత్రాలుగా మారిన పరిస్థితి.

అలాగే ప్రత్యేక రాష్ట్రం వస్తే సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశించారు.. కానీ ఆశలు అడియా శలయ్యాయి. సాధించుకున్న తెలంగాణ కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే. మరి సామాజిక, ప్రజాస్వామ్య తెలంగాణ మాటేమిటి? దానిని సాధించటానికి మరో ఉద్యమం తప్పదా?

- 56.33% బీసీ జనాభా, తెలంగాణ ముమ్మాటికీ బహుజనులదే

తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సీపెక్ సర్వే 2024లో ప్రకారం బీసీల జనాభా 56.33%. హిందూ బీసీల జనా భా 46.25%, ముస్లిం బీసీలు 10.08%. (రాష్ట్రంలోని 33 జిల్లాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీల జనాభా టేబుల్ 1లో ఇవ్వటం జరిగింది). 33 జిల్లాల్లో 21 జిల్లాల్లో బహుజ నుల జనాభా 90% పైబడి ఉంది. భారతదేశంలోనే బహుజనుల జనాభా అత్యధి కంగా ఉన్న ఒక ప్రత్యేక రాష్ట్రం.

జనాభా సరే, కానీ.. బీసీల రాజకీయ ప్రాతినిధ్యం 15.91%

భారత రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించింది. అందువల్ల వారి శాసనసభ ప్రాతినిధ్యం వారి జనాభాకు దగ్గ రగా ఉండే అవకాశం ఏర్పడింది. కానీ బీసీలకు పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలలో ఇలాంటి రాజ్యాంగబద్ధ రాజకీయ రిజర్వేషన్ లేదు. ఫలితంగా జనాభాలో పెద్ద భాగం ఉన్నప్పటికీ వారి రాజకీయ ప్రాతినిధ్యం అసమానంగా ఉంది. 1952 నుంచి 2023 వరకు 16 సార్లు జరిగిన గత అసెంబ్లీ ఎన్నికలలో 1,741 అసెంబ్లీ స్థానాలకు పోటీ జరిగితే వీరు గెలుచుకున్నది కేవలం 277 మాత్రమే. అంటే ఈ శాతం 15.91 శాతం. వీరికి జనా భా దామాషా ప్రకారం రావాల్సింది 805. జనాభాలో పెద్ద శాతం ఉండి నష్ట పోయిన స్థానాలు 528. 

తెలంగాణలో బీసీ కులాలు134. ఇందులో బీసీ-ఈ ముస్లిం కులాలు 14. వీటిని తీసివేయగా బీసీ కులాలు 120. అందులో విశ్వకర్మ వర్గానికి చెందిన ఐదు కులాలను ఒకే కులం కింద పరిగణిస్తే బీసీ కులాలు మొత్తం 116. (తెలంగాణలోని వివిధ సామజిక వర్గాల ఎమ్మెల్యేల సంఖ్య టేబుల్ 2 లో చూపించడం జరిగింది). ఈ టేబుల్‌ని విశ్లేషిస్తే జనాభాలో అతిపెద్ద భాగమైన బీసీలు శాసనసభ్యులను అసెంబ్లీకి పంపడంలో తీవ్రంగా నష్టపోయారని చెప్పక తప్పదు. 

116 కులాలను విశ్లేషిస్తే.. 95 కులాలు అసెంబ్లీ గడప తొక్కలేదు. పెద్ద శాతం జనాభా కలిగి ఉన్న వడ్డెరలు, నాయీబ్రాహ్మణులు, శాలివాహనులు ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా పొందలేకపోయారు. అలాగే కుర్మ, రజక, విశ్వకర్మ పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికినీ నామమాత్రంగా ఎమ్మెల్యేలను పంపగలిగారు. కేవలం ఒక ఐదు కులాలు మాత్రమే రెగ్యులర్‌గా అసెంబ్లీకి శాసనసభ్యులను పంపగలిగారు. మరి జనాభాలో 7.24 శాతం ఉన్న రెడ్డి, వెలమ, కమ్మ, బ్రాహ్మణ కులా లు 926 మంది శాసన సభ్యులు అంటే.. 53.18% పంపగలిగారు. 

మరి ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యం. మైనారిటీ ప్రజలు.. మెజారిటీ ప్రజలను పాలిస్తే ఎలాం టి దుష్పరిణామాలు సంభవిస్తాయి.. దానికి తెలంగాణే నిదర్శనం. జనాభా ఎక్కువగా ఉన్న సమాజానికి నిర్ణయాధికారంలో తగిన ప్రాతినిధ్యం లేకపోతే, విద్య, ఉపాధి, పారిశ్రామిక అవకాశాలు, భూమి, ఆర్థిక వనరులు, సంక్షేమ విధానాల రూపకల్పనలో వారి ప్రయోజనాలు ఎలా ప్రతిబింబిస్తాయి? ఇది కేవలం ఎన్నికల ప్రశ్న కాదు. ఇది ప్రాతినిధ్యం  నిర్ణయాధికారం వనరుల పంపిణీ సామాజిక అభివృద్ధి అనే గొలుసుకు సంబంధించిన ప్రశ్న.

ఆర్థిక రంగంలోనూ ఇదే ప్రశ్న.. హైదరాబాద్ విస్తరణతో రియల్ ఎస్టేట్, ఐటీ, ఫార్మా, మైనింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, విద్య, వైద్యం వంటి రంగాలు భారీగా అభివృద్ధి చెందాయి. ఈ రం గాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల యాజమాన్య వాటా ఎంత? పెద్ద కంపెనీలలో వాటా ఎంత? పారిశ్రామిక పెట్టుబడుల్లో వాటా ఎంత? కాంట్రాక్టులు, సరఫరా వ్యవస్థలో వాటా ఎంత? ఉన్నత స్థాయి వృత్తుల్లో వాటా ఎంత?.. వారి పాత్ర నామమాత్రమే. 

తెలంగాణ కోసం రైతులు పోరాడారు. కార్మికులు పోరాడారు. విద్యార్థులు పోరాడారు. ఉద్యోగులు పోరాడారు. బహుజనులు పోరాడారు. వేలాది మంది త్యాగాలు చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం వేసుకోవాల్సిన ప్రశ్న.. తెలంగాణ వచ్చింది, కానీ  ప్రతి సామాజిక వర్గానికి నిర్ణయాధికారం వచ్చిందా? జనాభా లెక్కలు తెలుసుకోవడం మొదటి అడుగు. ప్రాతినిధ్యాన్ని లెక్కించడం రెండో అడుగు. వెనుకబాటుతనాన్ని గుర్తించడం మూడో అడుగు.

రాజకీయ నిర్ణయాధికారంలో సముచిత భాగస్వామ్యం సాధించడం తదుపరి ప్రజాస్వామ్య లక్ష్యం. అందుకే బీసీ సమాజం ముందుగా తమ జనాభా, తమ ప్రాతినిధ్యం, తమ ఆర్థిక స్థితి, తమ రాజకీయ అవకాశాలు అనే నాలుగు అంశాలను గణాంకాల ఆధారంగా అర్థం చేసుకోవాలి. మన ఓటు మన బలం.

మన జనాభా మన శక్తి. మన ప్రాతినిధ్యం మన హక్కు. రాజ్యాధికారం మన ఆత్మ గౌరవం, మన నిర్ణయాధికారం మన భవిష్యత్తు. ఈ గణాంకాలను కేవలం ఆవేదన వ్యక్తం చేయడానికి కాకుండా, ఓటరు చైతన్యం, రాజకీయ ప్రాతినిధ్యం, సంస్థాగత నిర్మాణం, విధానపరమైన డిమాండ్లుగా మార్చినప్పుడే అవి సామాజిక మార్పుకు ఉపయోగపడతాయి.

మరిన్ని వార్తలు