రుద్రమ వీరత్వానికి విగ్రహమే సాక్ష్యం

27-11-2026 | 05:05am

తెలంగాణ వీరనారి, కాకతీయుల కీర్తిపతాకను రెపరెపలాడించిన పరాక్రమశాలి, రాణి రుద్రమదేవి(Rani Rudrama Devi) చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన నేల చందుపట్ల. ఆ నేల పై ఒకనాడు సమరభేరి మోగింది. కత్తులు మెరిశాయి. గుర్రాల డెక్కల సవ్వడులు మార్మోగాయి. శత్రుసైన్యాల గుండెల్లో ఓ వీరనారి సింహనాదం ప్రతిధ్వనించింది.

అది సాధారణ యుద్ధభూమి కాదు. కాకతీయుల ఆత్మగౌరవ పరిరక్షణకు, ఓ సామ్రాజ్ఞి అంతిమ పోరాటానికి వేదికైన చారిత్రక నేల. రాజ్యాన్ని పాలించడం ఒక ఎత్తయితే, రాజ్యం కోసం ప్రాణాలొడ్డి పోరాడటం మరో ఎత్తు. ఈ రెండింటిలోనూ తనదైన ముద్ర వేసిన ధీరవనిత రుద్రమదేవి. శత్రువుల ముందు శిరస్సు వంచడం కంటే కదనరంగంలో కడశ్వాస విడవడానికే సిద్ధపడిన వీరనారి ఆమె.

అంబదేవుడితో అంతిమ యుద్ధం..

అంబదేవుడితో జరిగిన యుద్ధంలో క్రీ.శ. 1289 నవంబర్ 27న రుద్రమదేవి మరణించినట్లు నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్లలో లభించిన శిలా శాసనం చారిత్రక ఆధారంగా నిలిచింది. 1962లో వెలుగులోకి వచ్చిన ఈ శాసనం ఆమె మరణాన్ని ధ్రువీకరిస్తోంది. నాడు సమరభేరితో మార్మోగిన ఆ నేల నేడు చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచింది.  

వీరనారి విగ్రహంపై నిర్లక్ష్యం

అయితే, అదే నేలపై 7 క్వింటాళ్ల బరువుతో 12 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసి న రుద్రమదేవి కాంస్య విగ్రహం పదకొండేండ్లు దాటినా అధికారిక ఆవిష్కరణకు నోచుకోలేదు. చరిత్రకు గుర్తింపు తీసుకురావాలన్న యువత ప్రయత్నం నేటికీ అసం పూర్తిగానే మిగిలింది. వీరనారి చరిత్రకు శాసనం సాక్ష్యంగా నిలుస్తుంటే ఆమె విగ్రహానికి గౌరవం కల్పించడంలో జాప్యం ఎందుకు? పాలకుల హామీలు ఎందుకు అమలుకు నోచుకోవడం లేదు? చందుపట్లను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న డిమాండ్లు ఎప్పుడు నెరవేరతాయనేది సందిగ్ధంగా మారింది.

శాసనానికి ముత్యాలమ్మే సాక్షి..

చందుపట్ల గ్రామానికి పశ్చిమాన పెద్ద ముత్యాలమ్మ గుడి సమీపంలో రుద్రమదేవి వీరమరణాన్ని తెలిపే శాసనం ఉంది. 1962లో వెలుగులోకి వచ్చిన ఈ శాసనం సగానికి పైగా భూమిలో కూరుకుపోయిం ది. గ్రామానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త పెరంబుదూర్ శ్రీరంగాచార్య, శాసన పరిశోధకుడు డి.సూర్యకుమార్, సీనియర్ జర్నలిస్టు దైవదినం, టంగుటూరి సైదులు, వివేకానంద యువజన మండలి సభ్యులు దాని వెలికితీతకు కృషి చేశారు. అప్పటి కలెక్టర్ పురుషోత్తం రెడ్డి రూ.80 వేలతో పునరుద్ధరణ పనులు చేయించారు.

చారిత్రక గుర్తింపు 

1987లో ప్రముఖ చరిత్రకారుడు పరబ్రహ్మశాస్త్రి విస్తృత పరిశోధన చేసి శాస నం ప్రాధాన్యాన్ని నిర్ధారించారు. 2009 నవంబర్ 27న దానిని గద్దెపై ప్రతిష్ఠించారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన మెడి మెకల్ శాసనం కూడా చందుపట్ల శాసనం ప్రామాణికతను బలపరు స్తోందని చరిత్రకారుడు డాక్టర్ ద్యావనపల్లి సత్యనారా యణ పేర్కొంటున్నారు.

శాసనంలో ఏముంది?

రుద్రమదేవి వీరమరణం చివరి మజిలీ చందుపట్ల ప్రాంతంలో జరిగినట్లు శాస నం ద్వారా తెలుస్తోంది. పూర్వంలో రాజ్య పర్యటనలో భాగంగా వరంగల్, పిల్లలమర్రి నుంచి ఇనుపాముల మీదుగా చం దుపట్ల చేరుకొని శివపూజలు నిర్వహించి పానగల్లు వెళ్లేవారని తెలుస్తోంది. ఈ ప్రాం తంలో వారికి కొంత సైన్యం ఉన్నట్లు శాస న ఆధారాలు సూచిస్తున్నాయి. క్రీ.శ. 1289 నవంబర్ 27 నాటి ఈ శాసనాన్ని రుద్రమదేవి వీరమరణానికి గుర్తుగా ఆమె సేనాధిపతి మల్లికార్జున నాయకుడు, పువ్వుల ముమ్మడి వేయించారు.

చందుపట్ల సోమనాథ దేవాలయా నికి కొంత భూమిని దానం చేసినట్లు ఇందులో పేర్కొన్నారు. ఈ శాసనం ఆధారంగా రుద్రమ దేవి మరణించిన తేదీని చరిత్రకారులు నిర్ధారించారు. ఆమె వయ సు, 80 సంవత్సరాలు త్రిపురాంతకం శాసనం ఆధారం గా అంబదేవుడితో జరిగిన పోరులో మల్లికార్జునుడితో సహా పలువురు మరణించి నట్లు తెలుస్తోంది. అంబదేవుడు త్రిపురాంతక శాసనంలో ‘సర్వా నాంధ్ర మహిపతిన్ ద్విత్వరణముకే యశోలబ్దవాన్’ అని వ్రా యించుకున్నాడు. ఆంధ్రదేశంలో అందరి రాజులను జయించి కీర్తి పొందా ను అని చెప్పుకున్నాడు కానీ రుద్రమను చంపానని చెప్పుకోలేదు. అప్పటికే ఆమె వయసు 80 సంవత్సరాలు.. ఒక వృద్ధ మహిళను చం పాననడం వీరుని లక్షణం కాదు కాబట్టి ఆమె మరణాన్ని ప్రస్తావించలేదు. 

కలెక్టర్ చొరవతో

రుద్రమ చరిత్రకు గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో వివేకానంద యువజన మండలి సభ్యులు 2012 ఆగస్టులో అప్ప టి కలెక్టర్ ముక్తేశ్వరరావును కలిసి శాసన ప్రాశస్త్యాన్ని వివరించారు.గ్రామాన్ని పర్యా టకకేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరా రు. స్పందించిన కలెక్టర్  ఎస్‌బీహెచ్ సహకారంతో కాంస్య విగ్రహం ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. సుమారు రూ.6.50 లక్షల వ్యయంతో 12 అడుగుల ఎత్తు, 7 క్వింటాళ్ల బరువున్న కాంస్య విగ్రహాన్ని రూపొందించారు. దాతల సహకారంతో గద్దె నిర్మించి 2014లో చందుపట్ల స్టేజీ వద్ద విగ్రహాన్ని నెలకొల్పారు. అయితే అధికారిక ఆవిష్కరణ మాత్రం జరగలేదు. విగ్రహంపై కప్పిన ముసుగు ప్రకృతి ప్రభావంతో తొలగిపోయిందే తప్ప లాంఛ నంగా ఆవిష్కరించిన దాఖలాలు లేవు.

అటకెక్కిన హామీలు! 

2015 ఏప్రిల్ 26న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చందుపట్లను సందర్శిం చారు. గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని, ఏటా కాకతీయ ఉత్స వాలు నిర్వహిస్తామని,  కాకతీయ శిలాతోరణం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 2022 జులై 12న అప్పటి గవర్నర్ తమిళిసై సౌం దరరాజన్ కూడా గ్రామాన్ని సందర్శించి రుద్రమదేవి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.

అయినా ఆచరణలో ఆశించిన మార్పు కనిపించడం లేదు. అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కల్వకుంట్ల కవితతో పాటు పలువురు ప్రముఖులతో విగ్రహ ఆవిష్కరణకు ప్రయత్నించినట్లు చర్చ జరిగింది. అయితే కార్యక్రమం ఎందుకు కార్య రూపం దాల్చలేదన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది. కమి టీలో సమన్వయ లోపమా? అంతర్గత విభేదాలా?వ్యక్తిగత నిర్ణయాలా? రాజకీయ ఒత్తిళ్లా? అధికారుల నిర్లక్ష్యమా? అనే సందేహాలున్నాయి. విగ్రహ పరిసరాల మరమ్మతులు, పచ్చదనం, సుంద రీకరణకు ఎస్బీఐ సహకారం చాలని విరమణ సభ్యులు ప్రతిపాదనలు పంపించా రు. నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. 

ఆవిష్కరణకు ముహూర్తమెప్పుడు? 

రుద్రమ విగ్రహాన్ని అధికారికంగా ఆవిష్కరించేందుకు యువత చేస్తున్న ప్రయ త్నాలకు ప్రభుత్వం అండగా నిలవాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు, యువజన మండలి, గ్రామ పెద్దలు సమన్వయంతో  అభివృద్ధి పనులు పూర్తి చేయాలి. పదకొండేళ్ల నిరీక్షణకు ఇకనైనా తెరపడాలి. రుద్రమదేవి చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చదివిస్తూ.. ఆమె విగ్రహానికి మాత్రం తగిన గౌరవం కల్పించలేకపోవడం చారిత్రక స్పృహకే మచ్చ. ఈ విషయంలో రాజకీయాలెందుకు? ఆవిష్కరణకు  వాయిదా లెందుకు? విగ్రహం పట్ల నిర్లక్ష్యం వీడి అధికారికంగా ఆవిష్కరించినప్పుడే ఆమెకు సముచిత గౌరవం లభిస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఆచరణలో కనిపించాలి.

వ్యాసకర్త : జర్నలిస్టు, 984877223

గడగోజు రవీంద్రాచారి

మరిన్ని వార్తలు