ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలి

05-10-2026 | 07:56pm

ఓటు హక్కును కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత: ఎమ్మెల్యే నాయిని

హనుమకొండ, (విజయక్రాంతి): ఏఐసీసీ ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Naini Rajender Reddy), వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. 

అంబేద్కర్ జంక్షన్ వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి పాదయాత్రగా హనుమకొండ కలెక్టరేట్ వరకు చేరుకున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు రక్షణ, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత కోసం నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలు తలెత్తేలా వ్యవహరించే ఎలాంటి చర్యలనైనా తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు. టీపీసీసీ ఉపాధ్యాక్షుడు, వరంగల్ పార్లమెంట్ ఇంచార్జ్, దుద్దిల శ్రీనివాస్ బాబు మాట్లాడుతూ ఎన్నికల వ్యవస్థపై వచ్చిన ఆరోపణలు, అభ్యంతరాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాల్లో మార్పులు, ఓట్ల తొలగింపు, ఓటు హక్కుకు సంబంధించిన అంశాలపై ప్రజల్లో అనుమానాలు లేకుండా పారదర్శకమైన విధానం ఉండాలని అన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రజాస్వామ్య వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ ఆరోపించారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ ఓడితల ప్రణవ్,రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కుసూరు పాషా, సంఘ వెంకట్రాజం, కుడా చైర్మన్ గుండు సుధారాణి, లైబ్రరీ చైర్మన్ అజీజ్ ఖాన్,ఇండియా కూటమి నాయకులు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి నున్న అప్పారావు, టీజేసీ అధ్యక్షులు జిల్లా రాజేంద్రప్రసాద్, సిపిఐ జిల్లా కార్యదర్శి బిక్షపతి,టీపీసీసీ ఉపాధ్యక్షులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,  ఈవీ శ్రీనివాసరావు, బత్తిని శ్రీనివాస్ రావు,  యువజన విభాగం నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు