ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి

13-10-2026 | 06:04pm

న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె

హనుమకొండ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్(NHM) పరిధిలో పనిచేస్తున్న 17 వేల మంది కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్(Outsourcing Employees) ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఎన్ హెచ్ఎం ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్ వద్ద నిరవధిక సమ్మె చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కరోనా విపత్కర సమయంలో ఎన్ హెచ్ఎం ఉద్యోగులు వారి ప్రాణాల సైతం లెక్కచేయకుండా ప్రజల క్షేమమే పరమావధిగా భావించి ప్రజల ప్రాణాలు కాపాడిన ఉద్యోగులను ఈ ప్రజా ప్రభుత్వం రోడ్డున పడేసిందని అన్నారు. హనుమకొండ జిల్లాలో 420 మంది ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు పనిచేస్తున్నారని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం,జిల్లా ప్రజా ప్రతినిధులు శ్రద్ధ తీసుకొని సీఎం దృష్టికి తీసుకువెళ్లి రెగ్యులర్ చేయాలని కోరారు. రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు 100 శాతం గ్రాస్ శాలరీ చెల్లించాలని, ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు.

అలాగే 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, 5 శాతం వార్షిక ఇంక్రిమెంట్లు, 8 శాతం లాయల్టీ బోనస్, పీఆర్సీ ప్రయోజనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్రంలోని 33 జిల్లాల ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు నేటి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సమ్మెలో వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొని  సంఘీభావం ప్రకటించారు.ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఎం జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్ డా. పుట్ట మహేందర్ రావు, జనరల్ సెక్రెటరీ రుక్ముద్దీన్, కోశాధికారి నరేశ్, జిల్లా ఎన్ హెచ్ ఎం జేఏసీ అధ్యక్షుడు డాక్టర్. నవీన్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ భూపతి ప్రవీణ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అభినందన్ రెడ్డి, ఏ ఎన్ ఎం వినోద, అనిత రెడ్డి,హనుమకొండ జిల్లా ఎన్ హెచ్ఎం ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు